టీఆర్ఎస్ లో లొల్లి: పద్మారావు సంచలన వ్యాఖ్యలు, నమస్కారం పెట్టిన ఈటల

By telugu teamFirst Published Sep 18, 2019, 8:55 PM IST
Highlights

టీఆర్ఎస్ లో అసంతృప్తి జ్వాలలు ఎగుసిపడుతూనే ఉన్నాయి. తాజాగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. జిహెచ్ఎంసి డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ వద్ద ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో అంతర్గతంగా రగులుతున్న అసంతృప్తి మరోసారి బయటపడింది. శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాదు మహానగర పాలక సంస్థ (జిహెచ్ఎంసి) డిప్యూటీ మేయర్ ఫసియుద్దీన్ వద్ద చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. 

ఉద్యమకారులమంటూ ఎవరూ చెబుకుని తిరగవద్దని, జీవితం దృష్టి పెట్టాలని పద్మారావు ఫసియుద్దీన్ తో అన్నారు. శాసనసభ ఆవరణలో ఆ సంఘటన జరిగింది. ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని పద్మారావు తన అసంతృప్తిని బయటపెట్టినట్లు చెబుతున్నారు. 

ఫసియుద్దీన్ తో పద్మారావు ఆ మాటలు అన్న సమయంలో మంత్రి ఈటల రాజేందర్ అటుగా వచ్చారు. ఆయనను చూపిస్తూ ఉద్యమకారులకు ఏం జరుగుతోందో వీళ్లకు అర్థం కావడం లేదని వ్యాఖ్ాయనించారు. ఆ మాటలు విన్న ఈటల ఏమీ మాట్లాడకుండా పద్మారావుకు నమస్కారం పెట్టి వెళ్లిపోయారు. 

గట్టిగా మాట్లాడుతున్న పద్మారావును శాసనసభ్యుడు బాల్క సుమన్ సముదాయించారు. పార్టీలో ఉద్యమకారులకు అన్యాయం జరుగుతోందని గత కొంత కాలంగా అసంతృప్తి వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. తామే గులాబీ ఓనర్లమని ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేసింది మొదలు ఏదో రూపంలో టీఆర్ఎస్ లో ఏదో రకంగా అసంతృప్తి బయటపడుతూ వస్తోంది. 

click me!