పార్టీలో సమస్యలున్నాయ్.. కానీ మునుగోడు కాంగ్రెస్‌కు కంచుకోట, పోటీ టీఆర్ఎస్‌తోనే: బీజేపీని లెక్కచేయని భట్టి

By Siva KodatiFirst Published Aug 7, 2022, 3:44 PM IST
Highlights

తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత సమస్యలున్నాయని ఆయన అంగీకరించారు. అయితే మునుగోడులో కాంగ్రెస్‌దే విజయమని భట్టి విక్రమార్క జోస్యం చెప్పారు

కాంగ్రెస్ పార్టీకి పలువురు రాజీనామా చేస్తుండటం, గ్రూప్ తగాదాల నేపథ్యంలో తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (bhatti vikramarka) స్పందించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్సే తానని, తానే కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. ఎవరూ ఆందోళన చెందొద్దని.. అందరితో తాను మాట్లాడుతానని భట్టి చెప్పారు. కాంగ్రెస్‌ను గెలిపిద్దామని.. ఆకాంక్షలు నెరవేర్చుకుందామని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైకమాండ్ ఆదేశాల ప్రకారమే పనిచేస్తామని.. పార్టీ అంతర్గత విషయాలు బయట మాట్లాడనని ఆయన తెలిపారు.

మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వంటిదని భట్టి వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికలో గతంలో కంటే ఇప్పుడు కాంగ్రెస్‌కు అధిక మెజారిటీ వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. మునుగోడులో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని విక్రమార్క తెలిపారు. ఆగస్టు 9 నుంచి 15 వరకు జిల్లా కాంగ్రెస్ నేతల పాదయాత్ర ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కూసుమంచి నుంచి సత్తుపల్లి వరకు తాను పాదయాత్ర చేస్తానని తెలిపారు. ఇక.. నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనపైనా భట్టి విక్రమార్క స్పందించారు. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకాకపోవడం సీఎం ఇష్టమని అన్నారు.

Also Read:రేవంత్ సైన్యం దొంగల ముఠా.. పెద్ద పెద్ద నాయకులు బీజేపీలో చేరతారు: రాజగోపాల్ రెడ్డి

కాగా... పార్టీ మారుతున్న వాళ్లపై కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుందన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy)  . శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ (bjp) ఇంకొంత మంది కోవర్టులను తయారు చేయొచ్చని ఆయన ఆరోపించారు. కండువా కప్పుకున్నాక పరిస్ధితి ఎలా వుంటుందో చూడాలని రేవంత్ వ్యాఖ్యానించారు. స్థాయి లేకపోయినా వేదికపై కాలు మీద కాలు వేసుకుని కూర్చొంటారని ఆయన ధ్వజమెత్తారు. పీసీసీ చీఫ్‌గా నాకే చాలాసార్లు కుర్చీ ఇవ్వరని, కానీ కాంగ్రెస్‌లో స్వేచ్ఛ వుంటుందని రేవంత్ అన్నారు. రాజకీయాల్లో సందర్భాలు... పదవులు మారుతాయని చెప్పారు. గుర్తింపు, హోదా ఇచ్చిన పార్టీలో పనిచేయడానికి రాజగోపాల్ రెడ్డికి (komatireddy raja gopal reddy) నామోషీనా అని రేవంత్ ప్రశ్నించారు. 

కాంగ్రెస్‌ను (congress) విధ్వంసం చేయాలనేది బీజేపీ కుట్ర అని ఆయన ఆరోపించారు. చంద్రబాబుతో (chandrababu naidu) కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నప్పుడు.. తన గురించి ఎందుకు మాట్లాడుతున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కష్టాల్లో వున్నప్పుడు తాను విడిచిపెట్టలేదని... ఆయన ఏపీ సీఎంగా, ఎన్డీయేలో వున్నప్పుడు గౌరవప్రదంగా కలిసి టీడీపీని వీడానని టీపీసీసీ చీఫ్ గుర్తుచేశారు. తెలుగుదేశానికి రాజీనామా చేసిన రోజున గన్‌మెన్‌లను, పీఏని, అసెంబ్లీ అధికారులు ఇచ్చిన బ్యాంక్ ఖాతాను కూడా క్లోజ్ చేశానని రేవంత్ గుర్తుచేశారు. 

click me!