ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు విధించింది కోర్టు.
భద్రాచలం: ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ భద్రాచలం కోర్టు గురువారంనాడు తీర్పును వెల్లడించింది. 2022లో ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు హత్యకు గురైన విషయం తెలిసిందే.2022 లో చంద్రుగొండ మండలం ఎర్రబోడు అటవీ ప్రాంతంలో పోడు భూముల విషయమై ఆదీవాసీలకు , అటవీశాఖాధికారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
ఆదీవాసీల దాడిలో అటవీశాఖాధికారి శ్రీనివాసరావు మృతి చెందారు.శ్రీనివాసరావు హత్య కేసులో మడకం తుల, మిడియం నంగాలను కోర్టు దోషులుగా తేల్చింది. వీరిద్దరికి జీవిత ఖైదుతో పాటు వెయ్యి రూపాయాల జరిమానాను విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.
ఎర్రబోడులో గుత్తికోయలు మొక్కలు నాటుతున్న విషయాన్ని తెలుసుకున్న ఎఫ్ఆర్ఓ అక్కడికి వెళ్లారు. ఈ విషయమై అటవీశాఖాధికారులతో గుత్తికోయలు దాడికి దిగారు.ఆదివాసీల దాడిలో ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఖమ్మం ఆసుపత్రిలో ఆయన మరణించారు. ఈ ఘటన 2022 నవంబర్ మాసంలో చోటు చేసుకుంది. హత్యకు గురైన ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. శ్రీనివాసరావుది ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం.