రేపటి నుంచి బతుకమ్మ చీరల పంపిణీ.. వెల్లడించిన మంత్రి కేటీఆర్

By Sumanth KanukulaFirst Published Sep 21, 2022, 5:19 PM IST
Highlights

బతుకమ్మ పండగకు రాష్ట్రంలోని ఆడబిడ్డలకు తెలంగాణ సర్కార్ ప్రతి ఏడాది చీరలను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది బతుకమ్మ చీరల పంపిణీ రేపటి నుంచి ప్రారంభం కానుంది. 

బతుకమ్మ పండగకు రాష్ట్రంలోని ఆడబిడ్డలకు తెలంగాణ సర్కార్ ప్రతి ఏడాది చీరలను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది బతుకమ్మ వేడుకలు సెప్టెంబర్ 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే రేపటి (సెప్టెంబర్ 22) నుంచి రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ చేయనున్నట్టుగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నేతన్నలకు చేయూతనివ్వడంతోపాటు, ఆడబిడ్డలకు ప్రేమపూర్వక చిరుకానుక ఇవ్వాలన్న ఉధాత్తమైన ఉభయతారక లక్ష్యంతో కార్యక్రమాన్ని 2017లో ప్రారంభించినట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు. 

రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బతుకమ్మ చీరెల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే అన్ని జిల్లాల కలెకర్లతో సమన్వయం చేసుకుంటూ, తమ టెక్స్‌టైల్‌ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా సంక్షోభంలో చిక్కుకున్న నేతన్నలకు ఒక గొప్ప భరోసా వచ్చిందని, వారి వేతనాలు రెట్టింపు అయ్యాయన్నారు. తద్వారా వారు తమ కాళ్లపైన తాము నిలబడే పరిస్ధితికి చేరుకున్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇక, తెల్ల రేషన్‌ కార్డు లబ్ధిదారులై, 18 ఏళ్లు నిండిన ప్రతీ మహిళకు బతుకమ్మ చీరను అందించనున్నారు.

గ్రామాల నుంచి వచ్చిన మహిళా ప్రతినిధుల అభిప్రాయాలు, ఆసక్తులు, నిఫ్ట్‌ డిజైనర్ల సహకారంతో సరైన డిజైన్లు, అత్యుత్తమ ప్రమాణాలతో ఈ ఏడాది బతుకమ్మ చీరెల నూతన డిజైన్లతో ఉత్పత్తి చేశామని కేటీఆర్ చెప్పారు. ఈ సంవత్సరం 24 విభిన్న డిజైన్లు, 10 రకాల ఆకర్షణీయ రంగుల్లో మొత్తం 240 రకాల త్రెడ్ బోర్డర్ (దారపు పోగుల అంచుల)తో తయారు చేయబడిన 100శాతం పాలిస్టర్ ఫిలిమెంట్ నూలు చీరలను టెక్స్‌టైల్‌ శాఖ తయారు చేసిందన్నారు. బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినప్పటీ నుంచి ఇప్పటి వరకు 5.81 కోట్ల చీరలను ఆడబిడ్డలకు ఐదు దఫాలుగా అందించినట్లు కేటీఆర్‌ వివరించారు.

ఇక, ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేసేందుకు దాదాపు 1.18 కోట్ల బతుకమ్మ చీరలను సిద్దంగా ఉంచారు. నేత కార్మికులకు షెడ్యూల్ ప్రకారం చీరలను పంపిణీ చేయడానికి వీలుగా ముందుగానే బుతకమ్మ చీరలకు ఆర్డర్ ఇచ్చింది. సిరిసిల్ల, పోచంపల్లి, గద్వాల్ తదితర ప్రాంతాల్లోని నేత కార్మికుల నుంచి దాదాపు రూ.340 కోట్ల విలువైన బతుకమ్మ చీరలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. 
 

click me!