పంజాబ్‌లో కేసీఆర్ ఇచ్చిన చెక్కులు చెల్లుతాయో లేదో తెలియదు: బండి సంజయ్

By Sumanth KanukulaFirst Published May 24, 2022, 1:54 PM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్తర భారత్ పర్యటనపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా సంచలనమే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉత్తర భారత్ పర్యటనపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా సంచలనమే అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం కేసీఆర్ పంజాబ్‌లో ఇచ్చిన చెక్కులు చెల్లుతాయో లేదో తెలియదని ఎద్దేవా చేశారు. చెక్ డ్రా చేసేదాకా వాటిని తీసుకున్న లబ్దిదారులకు టెన్షనే అని అన్నారు. కేసీఆర్ ఇక్కడే ఏమీ చేయలేదని.. అక్కడకు పోయి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. అయోధ్య రామ మందిరం నిర్మాణంపై టీఆర్ఎస్ అనుకూలమా..? కాదా..? అనేది చెప్పాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ వాళ్లు జై హనుమాన్ అంటున్నారంటే అది బీజేపీ గొప్పతనం అని సంజయ్ అన్నారు. 

ఇదిలా ఉంటే.. సోమవారం బీజేపీ పదాధికారుల సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. కేసీఆర్ దేశ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని మండిప‌డ్డారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు లేవని చెప్పేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అన్నారు. జూన్ 23 నుంచి తన మూడో విడత ప‌ద‌యాత్ర చేపట్టి కేసీఆర్‌ను ప్రజాకోర్టులో నిల‌బెట్టి.. నిజాలు బట్టబయలు చేస్తానని అన్నారు. రాష్ట్రంలోని అన్ని చోట్లా ముఖ్యమంత్రిని నిలదీయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలకు చెందిన మూడు సమావేశాలు జరిగాయని, తెలంగాణలో కాషాయ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రజలు అభిప్రాయపడుతున్నారని పేర్కొన్నారు.

మూడు ప్రముఖ సంస్థలు చేసిన సర్వేలు కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తుందని తేలిందని, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల పేలవమైన పనితీరును కూడా సర్వే ఎత్తి చూపిందని ఆయన పేర్కొన్నారు. ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌ ఉత్పత్తులపై వ్యాట్‌ తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ఇంధన ధరలను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టాలని పార్టీ కార్యకర్తలను కోరారు. మారుతున్న రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పార్టీ కార్యకర్తలు నిరంతరం కార్యక్రమాలు నిర్వహించాలని బండి సంజ‌య్ కోరారు. ఈ నెలాఖరు నాటికి ప్రధాని నరేంద్ర మోడీ ఎనిమిదేళ్ల పాలనను పూర్తి చేస్తారని, మే 30 నుంచి జూన్ 14 వరకు పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు.పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లాలన్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ‌, కేసీఆర్ తీరును ఎండగ‌ట్టాల‌ని పిలుపునిచ్చారు. 

click me!