వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాల్సిన అవసరం లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు విషయంలో కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ తెలిపారు.
నల్గొండ:వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాల్సిన అవసరమే లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. సోమవారం నాడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాల్సిన అవసరమే లేదని తాము నిరూపిస్తామన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నట్టుగా కేసీఆర్ రుజువు చేయగలరా ఆయన ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్ల పేరుతో విద్యుత్ సంస్థల దగ్గర రూ. 50 వేల కోట్లను అప్పు చేశారని బండి సంజయ్ కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అప్పులు తీర్చకపోతే రాష్ట్రంలోని డిస్కంలన్నీ కూడ కుప్పకూలే పరిస్థితి నెలకొందన్నారు. కమ్యూనిష్టులు ఎర్ర గులాబీలుగా మారి కేసీఆర్ పక్కన చేరారని ఆయన విమర్శలు చేశారు.మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు సీపీఐ మద్దతు పలకడంపై బండి సంజయ్ సెటైర్లు వేశారు. కమ్యూనిస్టులు ఎప్పుడు ఏం చేస్తారో కూడా తెలియదని గతంలో కూడా కమ్యూనిస్టులపై ఆయన విమర్శలు చేసిన విషయం తెలిసిందే. బీజేపీని ఓడిస్తేనే తమకు మనుగడ ఉంటుందనే భావనతో కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ కు కోవర్ఠులు మారారని బండి సంజయ్ ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు మోటార్లు బిగించాలని చెబుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీపై విమర్శలు చేస్తున్నారు. వ్యవసాయ మోటార్లకు తాము మీటర్ల బిగింపునకు తీవ్రంగా వ్య తిరేకిస్తున్నామని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తేనే విద్యుత్ శాఖకు నిధులు ఇస్తామని కేంద్రం సంస్కరణల పేరుతో రాష్ట్రాలపై పెత్తనం చేస్తుందని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్ల విషయమై కేసీఆర్ సహా, టీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. కేసీఆర్ చేసే వ్యాఖ్యలను నమ్మవద్దని కూడా బీజేపీ నేతలు రైతులను కోరుతున్నారు.