ఎంఐఎంది తాలిబాన్ భావజాలం, తరిమికొడ్తాం: బండి సంజయ్

By telugu teamFirst Published Aug 28, 2021, 1:32 PM IST
Highlights

తన పాదయాత్ర ప్రారంభానికి ముందు చార్మినార్ వద్ద జరిగిన బహిరంగ సభలో బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కేసీఆర్ ప్రభుత్వంపై, ఎంఐఎంపై ధ్వజమెత్తారు. ఎంఐఎంను తరిమికొడ్తామని అన్నారు.

హైదరాబాద్: ఎంఐఎంది తాలిబాన్ భావజాలమని, ఆ పార్టీని తరిమికొడ్తామని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తన పాదయాత్ర ప్రారంభానికి ముందు చార్మినార్ సమీపంలో శనివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అంతకు ముందు ఆయన చార్మినార్ సమీపంలో భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు నిర్వహించారు. 

తెలంగాణ ప్రజల్లో ఆత్మస్థైర్యం నింపడానికి తాను ప్రజా సంగ్రామ పాదయాత్ర చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై ఆయన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని ఆయన అన్నారు. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందని ఆయన అన్నారు. తన పాదయాత్రతో తెంలగాణ రాజకీయాల్లో ప్రకంపనలు ఖాయమని ఆయన అన్నారు.

దళితుడిని ఎందుకు ముఖ్యమంత్రిని చేయలేదని ఆయన కేసీఆర్ ను ప్రశ్నించారు. వేయి ఎకరాలు అమ్ముకున్న కేసీఆర్ దళితులకు ఒక్క ఎకరా భూమి కూడా ఇవ్వలేదని ాయన విమర్శించారు. పాతబస్తీ మాది అని, తెలంగాణ మాది అని ఆయన అన్నారు. లక్ష రూపాయల పంటల భీమా ఏమైందని ఆయన అడిగారు. తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన లేదని, కుటుంబ పాలన సాగుతోందని ఆయన అన్నారు. గిరిజన హక్కులను కేసీఆర్ ప్రభుత్వం కాలరాస్తోందని ఆయన అన్నారు. 

ఈ బహరింగ సభలో బిజెపి తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, జాతీయ నాయకురాలు డికె అరుణ, విజయశాంతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని బిజెపి నాయకత్వం యావత్తు ఈ కార్యక్రమానికి కదిలి వచ్చింది.

click me!