ఎనిమిది నెలల్లో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. కేంద్రంపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన కోరారు.
హైదరాబాద్: రానున్న ఎనిమిది నెలల్లో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని ఆయన పార్టీ శ్రేణులను కోరారు. బెంగాల్ లో మాదిరిగా బీజేపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నాడన్నారు. అలా చేస్తే తెలంగాణ కార్యకర్తలు తరిమితరిమి కొడతారనే సంగతి తెలుసుకునేలా చేయాలన్నారు. తనపైనే 11 నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టారని ఆయన గుర్తు చేశారు. ప్రజల కోసం జైలుకు పోయేందుకు సిద్ధంగా ఉన్నట్టుగా ఆయన ప్రకటించారు.
ఈ నెల 19న హైద్రాబాద్ లో జరిగే ప్రధాని నరేంద్ర మోడీ టూర్ విషయమై హైద్రాబాద్, రంగారెడ్డి జిల్లాల నేతలతో బండి సంజయ్ సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులను మంజూరు చేస్తే ఆ నిధులను కేసీఆర్ మళ్లించారని బండి సంజయ్ విమర్శించారు. సర్పంచ్ ల నిధులను మళ్లించిన కేసీఆర్, మంత్రులు,, అధికారులపై నాన్ బెయిలెబుల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, కంపా నిధులు సహా కేంద్రం తెలంగాణకు ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆయన మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ అభివృద్దికి పెద్ద ఎత్తున నిధులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సహకరించడం లేదని ఆయన విమర్శించారు.తెలంగాణలో ఉద్యోగులకు జీతాలే సక్రమంగా ఇవ్వలేని దుస్థితిలో కేసీఆర్ సర్కార్ ఉందని ఆయన విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణను ఏ విధంగా అభివృద్ది చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై జరుగుతున్న చర్చను దారి మళ్లించేందుకే కేంద్రం తెలంగాణకు నిధులివ్వడం లేదనే అబద్దాలను ప్రచారం చేస్తున్నారని తెలంగాణ మంత్రులపై ఆయన విమర్శలు చేశారు.
సీఎం కేసీఆర్ కు దమ్ముంటే తెలంగాణకు కేంద్రం ఏయే పథకానికి ఎన్ని నిధులిచ్చిందనే అంశంపై బహిరంగ చర్చకు సిద్దం కావాలని ఆయన సవాల్ విసిరారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని ఏ పథకానికి ఎన్ని నిధులిచ్చిందో చర్చించేందుకు దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని ఆయన బీఆర్ఎస్ ను సవాల్ విసిరారు. ఈనెల 19న ప్రధానమంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ వస్తున్న నేపథ్యంలో ఈ పర్యటనను విజయవంతం చేయాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొందన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అభివృద్ది లేదన్నారు. అందుకే కేంద్రంపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ఇవాళ్టికి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వలేదని ఆయన చెప్పారు. ఉద్యోగుల పిల్లలంతా ‘ మా నాన్నకు శాలరీ ఎప్పుడిస్తావ్ అని అడుగుతున్న రన్నారు. ప్రధానమంత్రిని ఏనాడూ నిధుల గురించి కేసీఆర్ అడగలేదన్నారు. కానీ కేంద్రంపై విమర్శలు చేస్తున్నారన్నారు. అధికారాన్ని కాపాడుకోవడానికి, పేరు ప్రతిష్టల కోసమే కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రజలు కడుతున్న పన్నులు ఏం చేస్తున్నావని ఆయన కేసీఆర్ ను ప్రశ్నించారు. జీతాలివ్వలేని, పెన్షన్ ఇవ్వలేని, రుణమాఫీ, దళిత బంధు, దళితులకు 3 ఎకరాలు ఇవ్వలేని పరిస్థతి ఎందుకొచ్చిందో చెప్పాలని ఆయన అడిగారు. 2014లో లిక్కర్ ఆదాయం రూ.10 వేల కోట్లుంటే నేడు రూ.40 వేల కోట్లు దాటిందన్నారు. రాష్ట్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు రూ.20 వేల కోట్లకు మించి ఖర్చు కావడం లేదని బండి సంజయ్ వివరించారు.