మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ బీజేపీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడు, పాత అధ్యక్షుడు తన ఫోన్ ఎత్తడం లేదని ఆరోపించారు.
మాజీ ఎమ్మెల్యే బాబు మోహన్ బీజేపీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడు, పాత అధ్యక్షుడు తన ఫోన్ ఎత్తడం లేదని ఆరోపించారు. బాబు మోహన్ నేడు మీడియాతో మాట్లాడుతూ.. తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయదలుచుకోలేదని చెప్పారు. ఎన్నికలకు, బీజేపీకి దూరంగా ఉంటానని తెలిపారు. ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండనున్నట్టుగా చెప్పారు. టీబీజేపీ పాత అధ్యక్షుడు, కొత్త అధ్యక్షులకు తాను ఎన్నోసార్లు ఫోన్ చేశారని.. కానీ వారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని చెప్పారు.
తాను ఏమైనా తనకు సీటు ఇవ్వమని అడుక్కుంటానా?అని బాబు మోహన్ అన్నారు. గెలిచే వారికే టికెట్ ఇస్తారని.. అందులో తాను లేను కావచ్చని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. బీజేపీ పెద్దలు అర్హులైన వాళ్లకు టికెట్ ఇవ్వండని.. తనను ప్రశాంతంగా ఉండనివ్వండని చెప్పారు. పోటీ చేయడానికి, పార్టీకి, ప్రచారాని దూరంగా ఉంటానని తెలిపారు. పార్టీ పెద్దలు స్పందించే దాని బట్టి తన రాజీనామా నిర్ణయం ఆధారపడి ఉంటుందని చెప్పారు. పార్టీ తనను అర్థం చేసుకున్నా, చేసుకోకపోయినా తనకేం నష్టం లేదని అన్నారు. తనకు పార్టీలో ఎన్నో అవమానాలు జరిగాయాని.. అవన్నీ తర్వాత చెబుతానని తెలిపారు.
బీజేపీ మొదటి జాబితాలో తన పేరు ప్రకటించక పోవడం, ఇద్దరు అధ్యక్షులు తన పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు తనను ఎంతో ఆవేదనకి గురి చేశాయని బాబు మోహన్ చెప్పారు. తన కుమారుడుకి టికెట్ అంటూ తన కుటుంబంలో చిచ్చు పెట్టె రీతిలో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి కొడుకులను వీడదిస్తారా? అని ప్రశ్నించారు. ఇంతకంటే పాపం ఉండదని అన్నారు. తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. తన పేరు వాడి ఇబ్బందులకు గురిచేయవద్దని కోరారు.