తారాస్థాయికి టీఆర్ఎస్ విభేదాలు: చందూలాల్ పై హత్యారోపణలు

By pratap reddyFirst Published Oct 25, 2018, 7:39 AM IST
Highlights

తమను హత్య చేయడానికి చందూలాల్ ప్రయత్నించారని ఆరోపిస్తూ ములుగు శాసనసభ నియోజకవర్గంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వరంగల్: ఆపద్ధర్మ మంత్రి అజ్మీరా చందూలాల్, ఆయన కుమారుడు అజ్మీరా ప్రహ్లాద్, మరికొంత మంది ఆయన అనుచరులపై హత్యా యత్నం కింద కేసు నమోదైంది. తమను హత్య చేయడానికి చందూలాల్ ప్రయత్నించారని ఆరోపిస్తూ ములుగు శాసనసభ నియోజకవర్గంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపైనే కాకుండా, ఆయన కుమారుడిపైనా, కొంత మంది ఆయన అనుచరులపైనా వెంకటాపురం పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది.

లంబాడా సామాజిక వర్గానికి చెందిన చందూలాల్ ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించడంతో టీఆర్ఎస్ లో అసమ్మతి తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఆ కేసు నమోదైంది. లంబాడాలకు కాకుండా ఆదివాసీలకు ములుగు శాసనసభ నియోజకవర్గాన్ని కేటాయించాలని టీఆర్ఎస్ నాయకులు కొంత మంది డిమాండ్ చేస్తూ వస్తున్నారు. 

గిరిజనులకు, గిరిజనేతరులకు మధ్య చందూలాల్, మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా అయిన ఆయన కుమారుడు ప్రహ్లాద్ చిచ్చు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. చందూలాల్ తనంత తాను పోటీ నుంచి తప్పుకోవాలని అడుగుతున్నారు. 

చందూలాల్ తప్పుడు పనులవల్ల ప్రజలు ఆయనను వ్యతిరేకిస్తున్నారని, పార్టీ ఓడిపోతుందని ఆయనను వ్యతిరేకిస్తున్న టీఆర్ఎస్ నాయకులు ఆందోళన చెందుతున్నారని, తన అనుచరులతో చందూలాల్ వ్యక్తిగత దాడులకు పురికొల్పుతున్నారని జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ సకినాల శోభన్ అంటున్నారు. 

తమను చంపడానికి చందూలాల్ అనుచరులను పంపించారని తాటి కృష్ణయ్య, పొరిక రేవంత్ నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు వివిధ సెక్షన్ల కింద చందూలాల్ పై, ప్రహ్లాద్ పై, టీఆర్ఎస్ వెంకటాపురం మండలాధ్యక్షుడు పొరిక హర్జీ నాయక్ పై, చీకుర్తి మధు, పోసాల అభి, ముదిగే రాజక్ కుమర్, సిఎచ్ పురుషోత్తమ్, వెంకటస్వామి, బాసబోయిన పోశాలు, గొర్రె దిలీప్, గునిగంటి హరీష్ లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

click me!