మరింత రసవత్తరం...హుజురాబాద్ పోటీలో 500మంది ఆర్యవైశ్యులు

By Arun Kumar PFirst Published Jul 26, 2021, 10:57 AM IST
Highlights

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఉపఎన్నికలు జరగనున్న హుజురాబాద్ నియోజకవర్గ రాజకీయాలు రోజురోజుకు మలుపు తిరుగుతున్నారు. తాజాగా ఆర్య వైశ్య వర్గీయులు భారీ సంఖ్యలో పోటీలో నిలవాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. 

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక మరింత రసవత్తరంగా మారుతోంది. ఈ ఉపఎన్నికలో 500 మంది ఆర్యవైశ్యులు పోటీలో నిలవనున్నట్లు ఆర్యవైశ్య చైతన్య పోరాట సమితి జాయింట్ సెక్రటరీ చిదురాల అభిషేక్ ప్రకటించారు. ప్రభుత్వం వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయకపోవడానికి నిరసనగానే తాము పోటీ చేయాలని నిర్ణయించినట్లు అభిషేక్ వెల్లడించారు. 

ఇక ఇప్పటికే వెయ్యి మందిని హుజురాబాద్ ఉపఎన్నికల బరిలో నిలపనున్నట్లు బిసి సంఘం నేత ఆర్ కృష్ణయ్య ప్రకటించారు. ఇటీవల ప్రభుత్వం ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ లను తొలగించిన విషయం తెలిసిందే. ఇలా ఉపాధి కోల్పోయిన 7600 మంది ప్రభుత్వానికి హుజురాబాద్ ఉపఎన్నికల ద్వారా సమాదానం చెప్పనున్నట్లు కృష్ణయ్య తెలిపారు.  వెయ్యి మంది ఫీల్డ్ అసిస్టెంట్లను హుజూరాబాద్ బరిలో దింపుతామని  కృష్ణయ్య హెచ్చరించారు. 

read more  ఈటల రాజేందర్ కే నా మద్దతు: మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు

అంతేకాదు ఇటీవల ప్రభుత్వం విధుల నుండి తొలగించిన స్టాఫ్ నర్సులు కూడా నామినేషన్లు వేసే అవకాశం వుందని హెచ్చరించారు. ఇలా ఇప్పటికే ఫీల్డ్ అసిస్టెంట్ లు, స్టాఫ్ నర్సులు హుజురాబాద్ ఉపఎన్నికలో పోటీకి సిద్దమవగా తాజాగా ఆర్య వైశ్యులు కూడా అదే బాటలో నడవనున్నట్లు ప్రకటించారు. 

మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరడంతో ఉపఎన్నిక అనివార్యమయ్యింది. ఈ ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్ని ఇప్పటికే రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో ప్రభుత్వ తీరుకు నిరసన తెలియజేయడానికి హుజురాబాద్ ఉపఎన్నికలను వాడుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్ లు, స్టాఫ్ నర్సులు, ఆర్య వైశ్యులు  చూస్తున్నారు.  
 

click me!