కిడ్నాప్ కేసు: హైదరాబాద్ పోలీసుల చేతికి చిక్కిన ఏపీ టీడీపీ నేత

By sivanagaprasad KodatiFirst Published Jan 10, 2019, 8:22 AM IST
Highlights

కిడ్నాప్ కేసులో సూత్రధారిగా ఉన్న విశాఖకు చెందిన టీడీపీ నేత రాకేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం సీఎన్ కాలనీకి చెందిన రాకేశ్ కేబుల్ వ్యాపారం చేస్తూ స్థానికంగా తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు

కిడ్నాప్ కేసులో సూత్రధారిగా ఉన్న విశాఖకు చెందిన టీడీపీ నేత రాకేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నం సీఎన్ కాలనీకి చెందిన రాకేశ్ కేబుల్ వ్యాపారం చేస్తూ స్థానికంగా తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు.

ఈ క్రమంలో అతనికి దామోదర్ అనే వ్యక్తి  పరిచయమయ్యాడు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. ఇది నమ్మిన రాకేశ్ తన బంధువులు ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షల చొప్పున వసూలు చేసి రూ.50 లక్షలు చెల్లించాడు. అయినప్పటికీ దామోదర్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు.. ఉద్యోగం గురించి అడిగితే ఏదో ఒక సాకు చెప్పేవాడు.

ఈ క్రమంలో డబ్బు చెల్లించాల్సిందిగా దామోదర్‌ను రాకేశ్ నిలదీశాడు. వ్యవసాయ భూములు తన పేరిట రాయాలని అడిగాడు. అవి బంజారాహిల్స్, సాగర్ సొసైటీలో ఉండే తన బాబాయ్ కుమారుడు బాలాజీకుమార్ పేరిట ఉన్నాయని చెప్పి, అతడిని ఒప్పించి రాస్తానని చెప్పాడు.  

గత నెల 13న రాకేశ్ తన అనుచరులను హైదరాబాద్ పంపి సాగర్‌ సొసైటీలో ఉంటున్న బాలాజీని కిడ్నాప్ చేసి పిడుగురాళ్లకు తరలించాడు. అక్కడ ఓ చోట బంధించి భూములు రాసివ్వాలని కొట్టాడు.. అంతేకాకుండా అతని తండ్రికి ఫోన్ చేసి బెదిరించి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు..

అయితే దామోదర్ చెప్పిందంతా తప్పని తెలుసుకున్న రాకేశ్‌.. బాలాజీని విడిచిపెట్టాడు. తండ్రి సాయంతో హైదరాబాద్‌కు చేరుకున్న బాలాజీకుమార్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను తీవ్రంగా కొట్టారని, స్టాంప్ పేపర్లపై సంతకాలు తీసుకోవడంతో పాటు ఏటీఎం కార్డు తీసుకుని డబ్బు డ్రా చేసుకున్నారని, బంగారు ఆభరణాలను లాక్కొన్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో విశాఖపట్నం నుంచి బుధవారం హైదరాబాద్‌కు వచ్చిన రాకేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

click me!