బీఆర్ఎస్‌పై ఘాటు విమర్శలు చేశారు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి. బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మారిపోయాయన్నారు. బీఆర్ఎస్ రెండు సార్లు మోసపూరిత వాగ్థానాలతో అధికారంలోకి వచ్చిందని , ఇక్కడ లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని మాట తప్పారని ఆమె దుయ్యబట్టారు.
బీఆర్ఎస్‌పై ఘాటు విమర్శలు చేశారు ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కూకట్‌పల్లిలో జనసేన అభ్యర్ధి ప్రేమ్‌కుమార్ తరపున ఆమె ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు నీటి మూటలుగా మారిపోయాయన్నారు. బీజేపీ, జనసేనలు మాత్రం ప్రజల సమస్యలపై గళం విప్పి పోరాటే పార్టీలని ఆమె అన్నారు. నియోజకవర్గంలో ట్రాఫిక్, మౌలిక వసతుల లేమితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో మార్పు అవసరమని ప్రజలు భావిస్తున్నారని పురందేశ్వరి చెప్పారు.
బీఆర్ఎస్ రెండు సార్లు మోసపూరిత వాగ్థానాలతో అధికారంలోకి వచ్చిందని , ఇక్కడ లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని మాట తప్పారని ఆమె దుయ్యబట్టారు. పేపర్ లీక్‌తో గ్రూప్ అభ్యర్ధులు ఇబ్బందులు పడ్డారని.. అసలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో బీఆర్ఎస్ చెప్పాల్సిన అవసరం వుందని పురందేశ్వరి పేర్కొన్నారు. పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇస్తామని చెప్పి.. దానిని నెరవేర్చలేదని ఆమె ఎద్దేవా చేశారు.
9 లక్షల మంది దరఖాస్తులు పెట్టుకుంటే 50 వేల ఇళ్లు మాత్రమే నిర్మించారని పురందేశ్వరి దుయ్యబట్టారు. దళితుడిని సీఎంను చేస్తామన్న హామీ కలగానే మిగిలిపోయిందని.. దళితులకు భూమి ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదన్నారు. దేశంలో 4 కోట్ల ఇండ్లను మంజూరు చేశారని.. వాటిలో 3 కోట్ల ఇండ్ల నిర్మాణం పూర్తి చేశామని పురందేశ్వరి చెప్పారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంలో కేంద్రం ఇచ్చిన డబ్బులు వున్నాయని .. అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్రం భాగస్వామ్యం వుందని ఆమె తెలిపారు.