బంగాళాఖాతంలో అల్పపీడనం... మరో రెండురోజులూ తెలంగాణలో వర్షాలు

By Arun Kumar PFirst Published Oct 2, 2020, 8:16 AM IST
Highlights

ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా సాధారణం నుండి భారీ వర్షాలు కురుస్తుండగా మరో రెండు రోజులే ఇదే పరిస్థితి కొనసాగనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

హైదరాబాద్: ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా సాధారణం నుండి భారీ వర్షాలు కురుస్తుండగా మరో రెండు రోజులే ఇదే పరిస్థితి కొనసాగనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిషా తీరం, పశ్చిమ బంగాళాఖాతంలో  కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో గురువారం వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు తెలిపారు. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు... ఈ ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మరో రెండురోజులు(శుక్ర, శని) మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని ప్రకటించింది. 

తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో గతకొన్నిరోజులుగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇలా రాష్ట్రంలోనే కాదు ఎగువన కురుస్తున్న కుంభవృష్టితో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద నీటితో ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు. 

ఈ భారీ వర్షాలతో రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద  కొనసాగుతోంది. దీంతో 12 క్రస్టుగేట్లను 10ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో 2,45,651 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 2,17,984 క్యూసెక్కులుగా వుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ  312.0405 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 310.2522 టీఎంసీలుగా వుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులయితే ప్రస్తుత నీటిమట్టం 589.40అడుగులుగా వుంది. 

వీడియో

"

click me!