తెలంగాణలో మరో ఐదురోజులు వానలు... ఆ జిల్లాల్లో భారీ వర్షాలు: వాతావరణ శాఖ

By Arun Kumar PFirst Published Aug 23, 2021, 10:50 AM IST
Highlights

తెలంగాణలో మరో ఐదురోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 

హైదరాబాద్: తెలంగాణలో మరో ఐదురోజులు వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని... ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం వుందని వెల్లడించారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, భువనగిరి, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా సోమవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.  

తెలంగాణలో కొన్నిరోజులుగా వర్షాలు మళ్ళీ జోరందుకున్నాయి.  వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దీనికి తోడు ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచి కొట్టాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురిసాయి. 

read more  విచిత్రం : వర్షాలు కురవాలని.. మద్యం,మాంసం నైవేద్యం..గుళ్లోనే తాగి,తినే సంప్రదాయం...

గత బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లాయి. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు ముంచెత్తింది. గత బుధవారం రాత్రి నుండి గురువారం ఉదయం వరకు అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో 12.8 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఇక బజారుహత్నూరులో 12.04సెం.మీ, తాంసిలో 11.28సిం.మీ, ఆదిలాబాద్ పట్టణంలో 10.26సెం.మీ ల వర్షపాతం నమోదయ్యింది. 

ఈ వర్షాలు మరో ఐదురోజులు కొనసాగనుందని వాతావరణ శాఖ ప్రకటన అన్నదాతల్లో ఆనందాన్ని పెంచింది. వర్షాలు ముఖం చాటేయడంతో ఎక్కడ పంటలు దెబ్బతింటాయోనని ఆందోళన చెందుతున్న రైతులకు తాజా వర్షాలు ధైర్యాన్నిచ్చాయి. 
 

click me!