
హైదరాబాద్: భారత రాజ్యాంగాన్ని (indian constitution) మార్చాల్సిన అవసరం వుందున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలతో పాటు దళిత, గిరిజన సంఘాలతో పాటు ప్రజా సంఘాలు కూడా రాజ్యాంగ మార్పు వ్యాఖ్యలను ఖండిస్తూ సీఎం కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆలిండియా ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ భరత్ వాఘ్మారే అయితే ఏకంగా కేసీఆర్ నాలుక కోస్తే నగదు బహుమతి అందిస్తానని ప్రకటించారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ (br ambedkar) రాసిన రాజ్యాంగాన్ని అవమానపర్చిన సీఎం కేసీఆర్ ను దళిత సమాజమే కాదు భారత ప్రజలెవ్వరూ క్షమించరని భరత్ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ నాలుక కోస్తే తన ఆస్తులను అమ్మి అయినా కోటి రూపాయలు బహుమతిగా ఇస్తానంటూ భరత్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
దేశంలోనే అత్యున్నతమైన రాజ్యాంగానే అవమానపర్చిన కేసీఆర్ సీఎం పదవిలో కొనసాగడానికి అర్హుడు కాదని... వెంటనే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. అంతేకాదు హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్ బండ్ పై గల అంబేద్కర్ విగ్రహం వద్ద ముక్కు నేలకు రాయడమే కాదు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని భరత్ వాఘ్మరే సూచించారు. లేదంటే ఆలిండియా ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక తరపున ఉద్యమిస్తామని భరత్ తెలిపారు.
ఇదిలావుంటే రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. బిజెపి అయితే కేసీఆర్ పై దేశ ద్రోహం కేసు వేయాలని నిర్ణయించింది. ఛేంజ్ సీఎం నాట్ కానిస్టిట్యూషన్ పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన బిజెపి ఇందులో భాగంగానే ఈ నెల 14 నుండి కోర్టుల ముందు నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించింది.
రాజకీయ దురుద్దేశంతోనే రాజ్యాంగాన్ని తిరిగి రాయాలాంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కేసీఆర్ అవమానించారని బిజెపి ఆరోపిస్తోంది. కేవలం అంబేద్కర్ నే కాదు రాజ్యాంగాన్ని రచించిన వారందరినీ కేసీఆర్ అవమానించారు. ఇది దేశ వ్యతిరేక చర్య కాబట్టి కేసీఆర్‌పై బిజెపి ధర్మ యుద్ధాన్ని ప్రారంభిస్తోందని తెలంగాణ బిజెపి తెలిపింది.
ఇక ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా గాంధీ భవన్ లో దీక్షలు చేపట్టింది. ఇందులో పాల్గొన్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని ఎందుకు మార్చాలనుకుంటున్నారని కేసీఆర్ ను ప్రశ్నించారు. మహిళను బానిసలాగా చూస్తున్నప్పుడు.. వారికి హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్‌దని భట్టి ప్రశంసించారు. ఆస్తిలో హక్కులు కల్పించి, లింగ వివక్ష లేకుండా చేసిన రాజ్యాంగము మార్చడానికి నువ్వెవడు అంటూ భట్టి ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందరికీ సమాన హక్కులు, వాక్ స్వాతంత్రం, భావ స్వేచ్ఛ కల్పించినందుకు మార్చాలని అనుకుంటున్నావా..? అంటూ విక్రమార్క నిలదీశారు.
రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే కేసీఆర్ పై పోలీసులకు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రాజ్యాంగంపై సీఎం వ్యాఖ్యలపై అభ్యంతరమని గజ్వేల్ పోలీస్ స్టేషన్ సీఎం కేసీఆర్ పై ఫిర్యాదు చేశారు. ఇప్పుడున్న భారత రాజ్యాంగంతో గడిచిన 75 సంత్సరాలలో ప్రజల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరడం లేదన్న సీఎం కామెంట్స్ ను పోలీసులకు వివరించి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసారు.