బీజేపీని తరిమికొట్టే కార్యక్రమం తెలంగాణ నుండే ప్రారంభం కావాలి: ఖమ్మం సభలో అఖిలేష్ యాదవ్

By narsimha lode  |  First Published Jan 18, 2023, 4:22 PM IST

 విపక్ష పార్టీల నేతలను బీజేపీ ఇబ్బందులకు గురి చేస్తుందని  సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఆరోపించారు . దర్యాప్తు  సంస్థలతో  కేసులను  బనాయిస్తుందన్నారు. 


ఖమ్మం: బీజేపీని తరిమికొట్టే కార్యక్రమం తెలంగాణ నుండే ప్రారంభం కావాలని  సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్  చెప్పారు.  బుధవారంనాడు  ఖమ్మంలో నిర్వహించిన  బీఆర్ఎస్ భారీ బహిరంగసభలో   సమాజ్ వాదీ పార్టీ చీఫ్  అఖిలేష్ యాదవ్  ప్రసంగించారు.  యూపీలో  బీజేపీని తరిమికొట్టే పనిని తాము చేపడుతామన్నారు.కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో కూర్చొని  ఒక్కో ప్రభుత్వాన్ని కూల్చాలని చూస్తుందని  ఆయనఆరోపించారు. ఖమ్మం ప్రజలు రాజకీయంగా చైతన్యవంతులన్నారు.  చారిత్రక ఖమ్మం నగరం జనసంద్రంగా మారిందన్నారు.  ఖమ్మం సభ దేశానికి మంచి  సందేశం ఇస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.బీజేపీయేతర ప్రభుత్వాలను  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం  ఇబ్బంది పెడుతుందని ఆయన ఆరోపించారు. దర్యాప్తు సంస్థలను  చూపి   విపక్ష నేతలను  భయపెట్టాలని చూస్తుందన్నారు.

దర్యాప్తు సంస్థలు  బీజేపీ జేబు సంస్థలుగా మారాయన్నారు. కేంద్ర ప్రభుత్వానికి  400 రోజులే ఉందని మోడీ చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు.   మోడీ సర్కార్ కు కౌంట్ డౌన్ ప్రారంభమైందన్నారు. ఇవాళ్టితో  కేంద్రానికి  ఇంకా  399 రోజులు మాత్రమే మిగిలి ఉందన్నారు.  ఇక నుండి కేంద్ర ప్రభుత్వం రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనని  అఖిలేష్ యాదవ్  చెప్పారు.  రానున్న రోజుల్లో కేంద్రంలో  కొత్త సర్కార్ ఏర్పాటుకు తాము కలిసికట్టుగా  పనిచేస్తామని  అఖిలేష్ యాదవ్  చెప్పారు. 

Latest Videos

రైతుల్ని ఆదుకొంటామని  ఇచ్చిన హామీని  బీజేపీ  విస్మరించిందన్నారు.  రైతులకు  ఆదాయం కల్పిస్తామని  ఇచ్చిన హమీ నెరవేరలేదన్నారు.  రైతుల పెట్టుబడి వ్యయం మరింత పెరిగిందని ఆయన ఆరోపించారు. నిరుద్యోగులను  ఆదుకొంటామని ఇచ్చిన హామీని  అమలు చేయలేదన్నారు.  దేశంలో  నిరుద్యోగం రికార్డు స్థాయికి చేరుకుందన్నారు.  గంగా నదిని ప్రక్షాళన చేస్తామని నమ్మక ద్రోహం చేశారని ఆయన మోడీపై మండిపడ్డారు.జీ-20 అధ్యక్ష పదవిని కూడా  మోడీ తన ప్రచారం కోసం ఉపయోగించుకుంటున్నారని ఆయన  ఆరోపించారు.  

సమీకృత కలెక్టరేట్ల ద్వారా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్న కేసీఆర్ సర్కార్ ఆయన అభినందించారు.   తెలంగాణలో ప్రతి ఇంటికి మంచినీరు  ప్రతి ఎకరానికి సాగునీరు అందుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ  కేసీఆర్ పాలనపై  అఖిలేష్ యాదవ్ ప్రశంసలు గుప్పించారు.  తెలంగాణ పథకాలను  కేంద్రం కాపీ కొడుతుందన్నారు.  బీజేపీ భ్రమలు  కల్పించే పార్టీగా ఆయన పేర్కొన్నారు. బీజేపీతో  జాగ్రత్తగా  ఉండాలని   ఆయన ప్రజలను  కోరారు.  

click me!