దిశ నిందితుల ఎన్ కౌంటర్... భయంతో ఉరివేసుకున్నాడు..

By telugu teamFirst Published Dec 9, 2019, 7:57 AM IST
Highlights

పెళ్లయినప్పటి నుంచే విమలను లక్ష్మీరాజం వేధించేవాడు. అతడి తీరు మారకపోవడంతో గత మే నెలలో భర్తపై ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది. కోర్టులో రాజీపడటంతో సిద్దిపేటలో కాపురం పెట్టారు.

ఇటీవల దిశ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.... ఆ ఎన్ కౌంటర్ చూసిన తర్వాత భయంతో ఓ కేసులో నిందితుడు ఉరివేసుకున్నాడు. ఈ సంఘటన సిద్ధిపేటలో చోటుచేసుకుంది.

కుటుంబకలహాలతో ఉన్మాదిగా మారి, నిద్రపోతున్న భార్య, బిడ్డలపై టర్పంటైన్ పోసి... ప్రాణాలు తీశాడు. అనంతరం... 15రోజుల నుంచి పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.  అయితే.... దిశ నిందితులను ఎన్ కౌంటర్ ఘటన చూసిన తర్వాత తనను కూడా దొరికితే..  పోలీసులు తనను కూడా ఎన్ కౌంటర్ చేస్తారనే భయంతో... ఆత్మహత్య చేసుకున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే... జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నెమలికొండకు చెందిన లక్ష్మీరాజం (45). అతడికి సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లికి చెందిన విమలతో 12ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి పవిత్ర, జయ్‌పాల్‌ పిల్లలు. పెళ్లయినప్పటి నుంచే విమలను లక్ష్మీరాజం వేధించేవాడు. అతడి తీరు మారకపోవడంతో గత మే నెలలో భర్తపై ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది. కోర్టులో రాజీపడటంతో సిద్దిపేటలో కాపురం పెట్టారు.

గత నెల 21న భార్యాపిల్లలను ఖమ్మంపల్లిలోని ఆమె పుట్టింట్లో లక్ష్మీరాజం వదిలి వెళ్లాడు. అదే రోజు అర్ధరాత్రి అక్కడికి తిరిగొచ్చి తలుపులు బద్దలు కొట్టి.. నిద్రిస్తున్నవారిపై టర్పంటైన్‌ చల్లి.. సుతిలి బాంబులు అంటించి విసిరాడు.

ఆ మంటల్లో తీవ్రంగా గాయపడిన విమల, ఆమె కూతురు పవిత్ర, సోదరుడు జాన్‌రాజ్‌, ఆయన భార్య రాజేశ్వరి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. విమల సోదరి సునీత గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి కూడా విషమంగానే ఉంది. కుమారుడు జయ్‌రాజ్‌ మరో గదిలో నిద్రించడంతో అతడికి ముప్పు తప్పింది.
 
అప్పటి నుంచి నిందితుడు లక్ష్మీరాజం కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. హైదరాబాద్‌, బెంగళూరు, జగిత్యాల, కరీంనగర్‌ ప్రాంతాల్లో వెతికారు. నిందితుడి ఆచూకీ కోసం 150మందిని విచారించారు. అయినా నిందితుడి ఆచూకీ దొరకలేదు. ఈ క్రమంలో తన స్వగ్రామానికి సమీపంలో ఉన్న కొండగట్టు వద్ద అతడు చెట్టుకు ఉరి వేసుకున్న స్థితిలో కనిపించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 

click me!