
హైదరాబాద్ : ఫుల్ గా మద్యం తాగాడు...మద్యం మత్తులోనే డ్రైవ్ చేస్తూ ఇంటికి బయలు దేరాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నపోలీసులను చూసి తప్పించుకుందామని ప్రయత్నించి కాలు విరగొట్టుకున్నాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10 డైమండ్ పాయింట్ దగ్గర జరిగింది.
డైమండ్ పాయింట్ దగ్గర పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మాదాపూర్ నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10 మీదుగా ద్విచక్రవాహనంపై ఓ యువకుడు వస్తున్నాడు. డైమండ్ పాయింట్ దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం చూసి తప్పించుకోవాలని ప్రయత్నించాడు.
తన వాహనాన్ని అక్కడ వదిలేసి పరుగెత్తాడు. పోలీసులు సైతం ఆ యువకుడిని వెంబడించారు. పరుగెత్తి పరుగెత్తి డివైడర్ ను ఢీకొట్టి కిందపడటంతో ఆ యువకుడికి కాలు విరిగిపోయింది. పోలీసులు అతనిని 108లో ఆస్పత్రికి తరలించారు.