కామారెడ్డి జిల్లాలో వాగులో చిక్కుకొన్న 8 మంది కూలీలు: రక్షించారిలా....

By narsimha lodeFirst Published Aug 26, 2021, 2:34 PM IST
Highlights


కామారెడ్డి జిల్లాలో వాగులో చిక్కుకున్న 8 మంది కూలీలను సురక్షితంగా స్థానికులు తీసుకొచ్చారు. ఎగువన కురిసిన వర్షాలకు వాగుకు ఆకస్మాత్తుగా  వరద వచ్చింది. దీంతో వరదలో చిక్కుకున్న కూలీలను స్థానికులు తాడు సహయంతో రక్షించారు.

కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో వాగులో చిక్కుకున్న  ఎనిమిది మంది కూలీలను స్థానికులు రక్షించారు. జిల్లాలోని జుక్కల్ మండలం  హుంగార్గా గ్రామ శివారులో  ఉన్న వాగుకు భారీగా వరద వచ్చింది. మహారాష్ట్ర,కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు కురవడంతో  వాగులో ఒక్కసారిగా వరద ప్రవాహం పెరిగింది.

వాగుకు అవతలివైపున ఉన్న  పొలంలో పనులకు కూలీలు వెళ్లారు. అయితే ఆ సమయంలో వాగుకు ఒక్కసారిగా వరద పెరిగింది. దీంతో వాగు గుండా అవతలికి వెళ్లేందుకు ప్రయత్నించినా కూలీలు ఇబ్బందిపడ్డారు. పక్కనే ఉన్న వ్యవసాయ షెడ్డులో కూలీలు తలదాచుకొన్నారు.

అయితే ఈ విషయాన్ని మరోవైపున ఉన్న ఓ వ్యక్తి గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు , గ్రామస్థులు వాగు వద్దకు చేరుకొన్నారు. తాడు సహాయంతో షెడ్డులో చిక్కుకొన్న కూలీలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.వాగుకు అవతలి వైపున పెసర చేలో పనిచేసేందుకు వెళ్లిన కూలీలు వాగులో చిక్కుకున్నారు.

సకాలంలో స్పంందించిన పోలీసులు, స్థానికులు కూలీలను రక్షించారు. నిత్యం ఇదే వాగు ద్వారా పొలాల్లో పనికి కూలీలు వెథ్తుంటారు. అయితే వరద ప్రవాహం  ఊహించని విధంగా పెరిగిందని దీంతోనే ఆ వరదలో చిక్కుకున్నట్టుగా కూలీలు చెప్పారు.

 


 

click me!