కరోనా టీకా.. భారత్ పై రాయబారుల ప్రశంసలు

By telugu news teamFirst Published Dec 10, 2020, 8:07 AM IST
Highlights

టీకాల తయారీ కోసం భారత్ శాస్త్రవేత్తల కృషి ఆకట్టుకుంటోందని రాయబారులు పేర్కొన్నారు. అన్ని దేశాలకు వ్యాక్సిన్ అందించే సత్తా ఉన్న దేశం భారత్ ఒక్కటేనని చెప్పారు.

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ మహమ్మారి కి వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. కాగా.. ఈ కరోనాను జయించేందుకు భారత్, తెలంగాణ ప్రభుత్వాలు, సంస్థల  చొరవ అభినందనీయమని రాష్ట్రానికి వచ్చిన రాయబారులు, హైకమిషన్లు కొనియాడారు. ఇక్కడ కోవిడ్ టీకాల తయారీని పరిశీలించి సంతోషం వ్యక్తం చేశారు.

టీకాల తయారీ కోసం భారత్ శాస్త్రవేత్తల కృషి ఆకట్టుకుంటోందని రాయబారులు పేర్కొన్నారు. అన్ని దేశాలకు వ్యాక్సిన్ అందించే సత్తా ఉన్న దేశం భారత్ ఒక్కటేనని చెప్పారు. దీని ద్వారా ప్రపంచానికి ఎంతో సాయం చేస్తున్నారని పేర్కొన్నారు. 

దేశంలో కరోనా పరిశోధనల పురోగతి, వ్యాక్సిన్ తయారీ సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు బుధవారం జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్, బయోలాజికల్-ఇ సంస్థలను 64 దేశాల రాయబారులు, హైకమిషనర్లు సందర్శించారు. ఈ పర్యటనకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేతృత్వం వహించింది. సీఎస్ సోమేశ్ కుమార్ వారికి స్వాగతం పలికారు.

డెన్మార్క్ రాయబారి ఎఫ్ సానే మాట్లాడుతూ.. కరోనా పై పోరులో భారత్ ముందు వరసలో ఉందని చెప్పారు. టీకాల తయారీ ద్వారా కరోనాను పారదోలాలని భావించి ప్రజల క్షేమం కోసం కృషి చేస్తోందని చెప్పారు. వాణిజ్యం కంటే ప్రజల అవసరాల కోసం ఇక్కడి సంస్థలు, ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని అభినందించారు.

ఆస్ట్రేలియా రాయబారి బారీ ఓ ఫారెల్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా టీకాలు ఉత్పత్తి చేసే దేశాలు చాలా ఉన్నాయని.. కానీ అందరికీ సరిపోయేలా ఉత్పత్తి చేసే సామర్థ్యం భారత్ కు మాత్రమే ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వ  అతిథ్యానికి దన్యవాదాలు తెలిపారు.

హైదరాబాద్ ప్రపంచ టీకాల కేంద్రంగా అభివృద్ధి చెందిందని.. ప్రపంచంలో 33శాతం టీకాల ఉత్పత్తి ఇక్కడే జరుగుతోందని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ చెప్పారు. రూ.3.50లక్షల కోట్లతో ఔషధరంగం అగ్రగామిగా ఉందని వివరించారు. 

జినోమ్ వ్యాలీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘ ప్రపంచంలో మొదటి పది స్థానాల్లో ఉన్న గూగుల్, యాపిల్, ఫేస్ బుక్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు హైదరాబాద్ లోనూ తమ ప్రధాన కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. ఆరేళ్లలో 14వేల పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటయ్యాయి.’’ అని సీఎస్ చెప్పారు.

click me!