Telangana Elections 2023: బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు పోటీ చేస్తున్న గజ్వేల్‌లో అత్యధికంగా 145 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలోకి దిగారు. సీఎం కేసీఆర్ పై ఈ సారి కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు.
Telangana Assembly Elections 2023: తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఒక్కో నియోజకవర్గానికి సగటున 40 మంది చొప్పున, 4,798 మంది అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల కోసం తమ పత్రాలను దాఖలు చేశారు. తెలంగాణ శాసనసభకు జరగనున్న ఎన్నికలలో ముగ్గురు ప్రధాన పోటీదారులుగా ఉన్న బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల మధ్య తీవ్రమైన పోటీ ఏర్పడే అవకాశం ఉంది. నామినేషన్ల దాఖలుకు నవంబర్ 10 చివరి తేదీ చివరి నాటికి ఔత్సాహిక అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. నవంబర్ 30న ఒకే దశలో పోలింగ్ జరగనున్న 119 నియోజకవర్గాలకు మొత్తం మీద 4,798 మంది అభ్యర్థులు 5,716 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఈ లెక్కన ఒక్కో నియోజకవర్గంలో సగటు పోటీదారుల సంఖ్యను దాదాపు 40కి చేరుకుంది. చాలా నియోజకవర్గాల్లో గట్టి పోటీకి అవకాశం ఉంది. ఆయా నియోజకవర్గాల్లో స్వతంత్రులు సాధించిన ఓట్లు పోటీదారుల భవితవ్యాన్ని నిర్ణయించడంలో కీలకం కానున్నాయి.
ఊహించినట్లుగానే బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) పోటీ చేస్తున్న గజ్వేల్‌లో అత్యధికంగా 145 నామినేషన్లు దాఖలయ్యాయి. కేసీఆర్ తో పాటు, బీజేపీ నేత ఈటల రాజేందర్ నామినేషన్లతో పాటు నియోజకవర్గం నుంచి పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే, కేసీఆర్ పోటీ చేస్తున్న మరో నియోజకవర్గం కామారెడ్డిలో ఆయన పై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు (కేటీఆర్) ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో 36 మంది అభ్యర్థులు తమ పత్రాలను దాఖలు చేయగా, సిద్దిపేట నుండి మంత్రి టి. హరీష్ రావు సహా మొత్తం 62 నామినేషన్లు నమోదయ్యాయి.
నగర శివార్లలోని మేడ్చల్ నియోజకవర్గంలో నామినేషన్ల చివరి రోజు ముగిసే సమయానికి 116 నామినేషన్లు దాఖలయ్యాయి, మరో నియోజకవర్గం ఎల్‌బీ నగర్‌లో 77 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థులు 50కి పైగా నామినేషన్లు దాఖలు చేయగా, ప్రస్తుతం మంత్రి జి. జగదీశ్వర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యాపేటలో 68 నామినేషన్లు దాఖలయ్యాయి. గత ఉప ఎన్నికలో అధికార బీఆర్ఎస్ గెలిచిన మునుగోడు 74 నామినేషన్లు నమోదయ్యాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలోని పలు నియోజకవర్గాల్లో 30కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయి.