హైదరాబాద్: పోటెత్తిన వరదనీరు.. సెల్లార్‌లో చిన్నారి దుర్మరణం

By Siva KodatiFirst Published Oct 18, 2020, 3:19 PM IST
Highlights

నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌ను ముంచెత్తిన అతి భారీ వర్షం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకోకముందే మళ్లీ అలాంటి సమస్యే ఎదురవుతోంది.

నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌ను ముంచెత్తిన అతి భారీ వర్షం నుంచి ప్రజలు పూర్తిగా కోలుకోకముందే మళ్లీ అలాంటి సమస్యే ఎదురవుతోంది. శనివారం సాయంత్రం నుంచి నగర వ్యాప్తంగా అతి భారీ స్థాయిలో వర్షం పడుతోంది.

ఉదయం నుంచి ఎండ కాయగా.. సాయంత్రం ఉన్నట్టుండి వాతావరణం మారిపోయి జోరున పెద్ద వాన కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు పోటెత్తింది.ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో విషాదం చోటు చేసుకుంది.

రోడ్ నంబర్ 5లోని దుర్గా భవాని నగర్ వద్ద వున్న సెల్లార్ గుంతలో పడి నాలుగేళ్ల బాలుడు దుర్మరణం పాలయ్యాడు. తాజా వర్షంతో మరోసారి నాలాలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి.

లష్కర్‌గూడా చెరువు ఉద్ధృతికి హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. అబ్ధుల్లాపూర్‌మెట్ మండలం ఇనాంగూడ ప్రాంతంలో జాతీయ రహదారిపై వరద ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతుండటం, రోడ్డు దెబ్బతినడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.

Also Read:చెరువులను తలపిస్తోన్న రహదారులు: హైదరాబాద్- బెజవాడ హైవేపై ట్రాఫిక్ జాం

దీంతో 65వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరోవైపు పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు వరద నీటి కారణంగా నిలిచిపోయాయి.

శనివారం చేపట్టిన రహదారి మరమ్మత్తులు సైతం వరద కారణంగా ఆగిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అటు హైదరాబాద్‌- బెంగళూరు జాతీయ రహదారిపై గగన్‌పహాడ్‌ వద్ద వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

దీంతో ఔటర్ రింగ్ రోడ్ మీదుగా ట్రాఫిక్‌ మళ్లించారు. ఆదివారం ఉదయం గగన్‌పహాడ్‌ వద్ద జాతీయ రహదారిని, గగన్‌పహాడ్‌ చెరువు, అప్ప చెరువు, పల్లె చెరువును సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పరిశీలించారు. 

click me!