
నిజామాబాద్: పెద్దగుట్ట(బడాపహడ్) దర్గాకు వెళుతుండగా డిసిఎం ప్రమాదానికి గురయి 30 మంది భక్తులు గాయపడ్డారు. మానాల గ్రామానికి చెందినవారు బడాపహాడ్ కు డిసిఎంలో బయలుదేరారు. అయితే ఈ డిసిఎం మరికొద్దిసేపట్లో గమ్యానికి చేరుకుంటుందనగా ప్రమాదానికి గురయ్యింది. వేగంగా వెళుతున్న డిసిఎం చందూరు సమీపంలో అదుపుతప్పి బోల్తా పడిటంతో అందులోనివారు గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నవారిలో ఎవరికీ ప్రాణహాని లేదని డాక్టర్లు చెప్పడంలో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. స్వల్ప గాయాలపాలైన వారికి అక్కడే ప్రథమచికిత్స అందించారు.
Read More హైద్రాబాద్ వనస్థలిపురంలో ప్రమాదం: హోటల్‌లోకి దూసుకెళ్లిన కారు
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే మంత్రి ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ అధికారులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా వైద్యులను,ఉన్నతాధికారులను మంత్రి అదేశించారు. బాధిత కుటుంబాలకు మనోదైర్యం చెప్పేందుకు ఇవాళ మంత్రి నిజామాబాద్ హాస్పిటల్ కు వెళ్ళారు. క్షతగాత్రులతో మాట్లాడి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు మంత్రి. అనంతరం డాక్టర్లతో మాట్లాడుతూ మంచి వైద్యం అందించాలని సూచించారు.