తెలంగాణలోని సూర్యాపేటలో తాజాగా మరో మూడు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో సూర్యాపేట జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 83కు చేరుకుంది.
హైదరాబాద్: తెలంగాణలోని సూర్యాపేటలో తాజాగా మరో మూడు కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో సూర్యాపేట జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 83కు చేరుకుంది. సూర్యాపేటలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తీవ్రంగా పరిగణించిన విషయం తెలిసిందే. సూర్యాపేట జిల్లాలో మంగళవారం ఒక్క రోజే 26 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువగా సూర్యాపేట పట్టణంలోనే నమోదయ్యాయి.
జీహెచ్ఎంసీ తర్వాత అత్యధిక కేసులు సూర్యాపేటలోనే నమోదయ్యాయి. మంగళవారం జీహెచ్ఎంసీలో కన్నా ఎక్కువ కేసులు అక్కడ నమోదయ్యాయి. దాంతో కేసీఆర్ సూర్యాపేటపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అంచనా వేయడానికి డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ సూర్యాపేటలో పర్యటించారు.
undefined
అదే సమయంలో కేసులు ఎక్కువగా నమోదవుతున్న గద్వాల, వికారాబాద్ జిల్లాలపై కూడా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆ జిల్లాల్లో పరిస్థితిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఈ మూడు జిల్లాలకు ప్రత్యేకాధికారులను కూడా నియమించారు.
సూర్యాపేటకు వేణుగోపాల్ రెడ్డిని ప్రత్యేకాధికారిగా నియమించారు. జిల్లాల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండడం ప్రభుత్వాన్ని కలవరానికి గురి చేస్తోంది. మర్కజ్ నుంచి వచ్చినవారి గురించి ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.