
గత నెలలో హన్మకొండలో కుక్కదాడిలో గాయపడిన 18 నెలల బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. గత 25 రోజులుగా ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి రాజు.. మృత్యువుతో పోరాడుతూ బుధవారం తుదిశ్వాస విడిచాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. హన్మకొండ జిల్లా కాజీపేట పరిధిలోని బట్టుపల్లి రాజీవ్ గృహకల్ప కాలనీలో జూన్ 17వ తేదీన ఇంట్లోకి చొరబడిన వీధి కుక్కలు.. ఆడుకుంటున్న పిల్లలపై దాడి చేశాయి.
ALso Read: వీధి కుక్కల స్వైరవిహారం.. కోజికోడ్‌లో స్కూళ్లకు సెలవు.. ఉపాధి పనులకూ బ్రేక్
కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 18 నెలల చిన్నారి డేవిడ్ రాజును ఓ కుక్క నోట కరచుకుని బయటకు ఈడ్చుకెళ్లింది. దీనిని గమనించిన స్థానికులు వీధి కుక్కలపై దాడి చేసి చంపేశారు. అనంతరం గాయపడ్డ చిన్నారులను హుటాహుటిన వరంగల్ ఎంజీఎంకు తరలించారు. రాజు ముఖంపై కుక్క తీవ్రంగా దాడి చేయడంతో దవడ కొంత వరకు తెగిపోయింది. చికిత్స అనంతరం బాలుడు కోలుకున్నట్లు కనిపించినా.. తర్వాత వింతగా ప్రవర్తిస్తూ ఈరోజు ప్రాణాలు కోల్పోయాడు. రాజు మరణంతో రాజీవ్ గృహకల్ప కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.