
వరంగల్ జిల్లా కాజీపేటలో బాలిక కిడ్నాప్ కలకలం రేపుతోంది. 20 రోజులుగా బాలిక ఆచూకీ లభించకపోవడంతో.. తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని బాలిక తల్లి హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించారు. అయితే బాలికను ఆమె బావ (అక్క భర్త) మధు కిడ్నాప్ చేసినట్టుగా తెలుస్తోంది. బాలిక కనిపించకుండా పోయిన రోజు మధు.. ఆమెను స్కూల్ వద్ద నుంచి తీసుకెళ్లాడు. బాలిక కనిపించకుండా పోయిన తర్వాత అతని ఫోన్ కూడా స్విచ్చాఫ్ అయింది.
వివరాలు.. కిడ్నాప్‌కు గురైన బాలిక కాజీపేటలోని ఓ స్కూల్లో 10వ తరగతి చదువుతోంది. అయితే బాలికను ఆమె బావ స్కూల్ నుంచి తీసుకెళ్లాడు. అయితే బాలిక ఇంటికి రాకపోవడంతో.. తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఈ నెల 7వ తేదీన బాలిక కిడ్నాప్ అయినట్టుగా ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఇప్పటివరకు బాలిక ఆచూకీ గుర్తించలేదు.
అయితే వరంగల్- హైదరాబాద్ హైవే రూట్‌లో బాలికను బైక్‌పై ఎక్కించుకుని వెళ్తున్నట్టుగా ఉన్న దృశ్యాలు టోల్‌గేట్ వద్ద సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. కానీ బాలిక ఆచూకీ లభించకపోవడంతో.. ఆమె కరుణ మానవహక్కుల వేదికను ఆశ్రయించారు. తమ బిడ్డను వెతికిపెట్టాలని బాలిక తల్లిదండ్రులు కోరుతున్నారు.