ఆలయంలో 15 పాముల కలకలం....నాగుపాము, తాడిజెర్రి, కట్లపాము... అన్నీ విషసర్పాలే

By Arun Kumar PFirst Published Aug 23, 2018, 12:18 PM IST
Highlights

నాగుపాము,కట్లపాము, తాడిజెర్రి....ఇవన్నీ భయంకరమైన విషసర్పాలు. వీటిలో ఏ ఒక్కటి మనకు కనిపించినా భయంతో వణికిపోతాం. అయితే ఇవన్ని ఒకేచోట గుంపులుగా కనిపిస్తే...ఇంకేమైనా ఉందా పై ప్రాణాలు పైకే పోతాయి. అయితేే తాజాగా మెట్ పల్లి లో ఇలా వివిధ జాతులకు చెందిన 15 విషసర్పాలు ఓ ఆలయ సమీపంలో కనిపించి భక్తులను భయకంపితులను చేశాయి.

జగిత్యాల జిల్లాలోని మెట్ పల్లి ప్రజలు విషసర్పాల భయంతో వణికిపోతున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో కలుగుల్లోంచి బైటకు వస్తున్న పాములు ఎక్కడపడితే అక్కడ గుంపులుగా కనిపిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా పట్టణంలోని అభయాంజనేయ స్వామి ఆలయ సమీపంలో 15 విషసర్పాలు ఓకే చోట గుంపుగా చేరి స్థానికులకు దర్శనమిచ్చాయి. దీంతో పట్టణ ప్రజల్లో భయాందోళన మొదలైంది.

ఆలయ సమీపంలో మొదట ఓ పామును స్థానికులు గుర్తించారు. దీంతో వారు సుల్తాన్ పూర్ కు చెందిన పాములు పట్టే వ్యక్తిని పిలిపించి ఈ పామును పట్టుకున్నారు. ఆ తర్వాత పరిసరాల్లో వెతగ్గా మరిన్ని పాములు కనిపించాయి. అన్నీ నాగుపాము,కట్ల పాము, తాడిజెర్రి వంటి విషపు జాతికి చెందినవే కావడంతో వాటిని పాములు పట్టే వ్యక్తి జాగ్రత్తగా పట్టుకున్నాడు. అనంతరం ప్లాస్టిక్ సంచుల్లో వాటిని బంధించి సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలేశాడు. 

అయితే ఒకే చోట ఇలా 15 పాములు సంచరించడం గురించి తెలుసుకుని పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే వర్షాకాలంలో ఇలా పాములు కలుగుల్లోంచి బైటకు వచ్చి తిరగడం మామూలేనని, ప్రజలే కాస్త జాగ్రత్తగా ఉండాలని స్నేక్ సొసైటీ సభ్యులు తెలిపారు. 
 

click me!