
ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంతో తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ట మసకబారిన సంగతి తెలిసిందే. ఎన్నికల నిర్వహణ చేతకావడం లేదంటూ విపక్షాలు భగ్గుమంటున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వంలోని కొందరు పెద్దలే ఈ స్కామ్ చేశారంటూ ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసును సిట్ విచారిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ టీఎస్‌పీఎస్సీలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా కమీషన్‌లో పది కొత్త పోస్టులను మంజూరు చేసింది. కొత్తగా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్‌ను సృష్టించింది. దీనికి సీనియర్ ఐఏఎస్ బీఎం. సంతోష్‌ను నియమించింది. దీనితో పాటు టీఎస్‌పీఎస్సీ అదనపు కార్యదర్శిగాను ఆయనను నియమించింది. ఇందుకోసం ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బాధ్యతల నుంచి సంతోష్‌ను బదిలీ చేసింది.
Also Read: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ : మహబూబ్‌నగర్ మరో ఇద్దరు అరెస్ట్
ఇక కమీషన్‌లోని మిగిలిన పోస్టుల విషయానికి వస్తే.. డిప్యూటీ కంట్రోలర్, అసిస్టెంట్ కంట్రోలర్, చీప్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, సీనియర్ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, జూనియర్ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, సీనియర్ ప్రోగ్రామర్, జూనియర్ ప్రోగ్రామర్. వీటికి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషనర్ పంపిన ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.
ఇదిలావుండగా.. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరిని శుక్రవారం సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మైసయ్య, జనార్ధన్ లను సిట్ అదుపులోకి తీసుకుంది. వీరిద్దరూ తండ్రీకొడుకులు కావడం గమనార్హం. అయితే వీరితో కలిపి టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వారి సంఖ్య 19కి చేరింది. ఢాక్యానాయక్ నుండి రూ. 2 లక్షలకు వీరు పేపర్ కొనుగోలు చేసినట్టుగా సిట్ బృందం గుర్తించింది.