తాము వినియోగదారుల వ్యక్తిగత సమాచారం అవసరానికి మించి సేకరిస్తున్నట్టు వస్తున్న వార్తలను షియోమీ ఇండియా తోసిపుచ్చింది. డేటా గోప్యత, భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించింది.
న్యూఢిల్లీ: తాము వినియోగదారుల వ్యక్తిగత సమాచారం అవసరానికి మించి సేకరిస్తున్నట్టు వస్తున్న వార్తలను షియోమీ ఇండియా తోసిపుచ్చింది. డేటా గోప్యత, భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించింది.
తమ వినియోగదారులను మొత్తం డేటాను రెండేళ్ల క్రితం స్థానిక సర్వర్‌లకు తరలించినట్టు షియోమీ ఇండియా వెల్లడించింది. వినియోగదారుల స్పష్టమైన అనుమతి లేకుండా డేటా తాము సేకరించడం లేదని షియోమీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మనుకుమార్ జైన్ ట్వీట్ చేశారు.
తమ దగ్గర ఉన్న వినియోగదారుల సమాచారం సురక్షితంగా ఉంటుందని, బయటకు వెల్లడించే అవకాశం లేదని షియోమీ ఇండియా ఎండీ మనుకుమార్ జైన్ పేర్కొన్నారు. ఇండియా డేటా ఇండియాలోనే ఉంటుందని స్పష్టం చేశారు.
షియోమీ తన కంపెనీ ఫోన్ల ద్వారా ఎక్కువగా యూజర్ డేటాను సేకరిస్తున్నట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని, ఇవన్నీ తప్పుడు వార్తలని మనుకుమార్ జైన్ ఓ ప్రకటనలో తెలిపారు.
‘ఇంటర్నెట్ సంస్థగా షియోమీ వినియోగదారుల సమాచార రక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. డేటా గోప్యతలో ప్రపంచంలోని ఇతర ప్రముఖ బ్రౌజర్‌ల మాదిరిగానే ఎంఐ బ్రౌజర్ ప్రోటోకాల్‌లను అనుసరిస్తుంది’ అని మనుకుమార్ జైన్ తెలిపారు.
‘ఇది వినియోగదారుల నుంచి స్పష్టమైన అనుమతి గానీ, సమ్మతి గానీ లేకుండా వారి డేటాను సేకరించదు. తమ దగ్గర ఉన్న సమాచారాన్ని పూర్తి సురక్షితంగా ఉంటుంది. రహస్య మోడ్‌లో బ్రౌజ్ చేసిన వాటిని ఎంఐ బ్రౌజర్ ఎప్పటికీ గుర్తించలేదు’ అని మనుకుమార్ జైన్ పేర్కొన్నారు.
‘లాగిన్ అయిన వినియోగ డేటా మీ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఉపయోగించబడుతుంది. ఉదాహరణకు ఏదైనా వెబ్‌సైట్ పని చేయకపోతే లేదా నెమ్మదిగా ఉంటే మీ బ్రౌజింగ్ అనుభవాన్ని మెరుగ్గా, వేగంగా చేయడానికి రహస్య డేటా ఉపయోగించబడుతుంది’ అని మనుకుమార్ జైన్ వెల్లడించారు.
‘ఇది ఇతర బ్రౌజర్ చేసే మాదిరిగానే ఉంటుంది. ఎంఐ బ్రౌజర్‌తో సహా షియోమీ స్మార్ట్‌ఫోన్లు, వాటిలోని డీఫాల్ట్ యాప్‌లు, వాటి భద్రత, గోప్యతపరంగా సురక్షితమని ప్రఖ్యాత అంతర్జాతీయ థర్డ్ పార్టీ కంపెనీలు ట్రస్ట్ఆర్క్, బ్రిటిష్ స్టాండర్డ్ ఇన్‌స్టిట్యూషన్ (బీఎస్ఐ) ధ్రువీకరించాయి’ అని పేర్కొన్నారు.
‘ఎంఐ బ్రౌజర్, ఎంఐ క్లౌడ్‌లోని భారత వినియోగదారుల డేటా అంతా ఇండియాలోని ఏఎస్‌డబ్ల్యూ సర్వర్లలో స్థానికంగా నిల్వ చేయబడుతుంది’ అని మనుకుమార్ జైన్ వివరించారు.