ఆ 20 కోట్ల యూజర్లే టార్గెట్.. హిందీలో ఫ్లిప్ కార్ట్ పోర్టల్

By rajesh yFirst Published Sep 4, 2019, 12:08 PM IST
Highlights


హిందీ భాష మాట్లాడే ఇంటర్నెట్ యూజర్లే లక్ష్యంగా ఆన్ లైన్ రిటైల్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ హిందీ ఇంటర్ ఫేస్‌ను ప్రవేశపెట్టనున్నది. 20 కోట్ల నూతన యూజర్ల దరికి చేరుకోవడమే తమ లక్ష్యమని పేర్కొంది. 

న్యూఢిల్లీ: వినియోగదారుల సౌకర్యార్థం తమ వెబ్‌సైట్‌ను హిందీలోనూ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ మంగళవారం ప్రకటించింది. హిందీలో వెబ్ సైట్ ప్రారంభించడం ద్వారా కొత్తగా 200 మిలియన్ల మంది కొత్త ఖాతాదారులను ఆన్ లైన్ కొనుగోళ్ల పరిధిలోకి తేవడమే తమ లక్ష్యమని ఫ్లిప్ కార్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. 

వచ్చే పండుగ సీజన్‌లో ఆఫర్ల సందడి త్వరలో ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో హిందీ ఇంటర్ పేస్‌లో  ఫ్లిప్‌కార్ట్ పోర్టల్ ఆవిష్కరించేందుకు సిద్ధం కావడం ఆసక్తికర పరిణామం. ప్రముఖంగా ద్వితీయ శ్రేణి, త్రుతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లోని ప్రజలను ఈ-కామర్స్ వైపు ఆకర్షించడమే లక్ష్యంగా హిందీ భాషలో వెబ్ సైట్ రూపొందించామని, దీనిని రూపొందించేందుకు నెలల తరబడి పరిశోధన జరపాల్సి వచ్చిందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.

ఫ్లిప్ కార్ట్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి మాట్లాడుతూ ‘హిందీలో వెబ్ సైట్ అందుబాటులోకి తేవడం వల్ల వస్తువుల సమాచారం అంతా ఆ భాష వినియోగదారులకు అర్థమయ్యే రీతిలో కనిపిస్తుంది. కొత్త వస్తువల గురించి హిందీలోనే వినియోగదారులు వెతుకవచ్చు. తొలిసారి ఇంటర్నెట్ ను ఉపయోగించే వారి కోసం త్వరలో వాయిస్ ద్రుశ్య ఆధారిత సహకార సౌలభ్యాన్ని యాప్ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నాం. హిందీ ఇంటర్ ఫేస్ వెబ్ సైట్‌ను అభివ్రుద్ధి చేసేందుకు భారీగా నిధులు సమకూర్చాం అని చెప్పారు. 

భవిష్యత్‌లో మరింత మంది వినియోగదారులను ఆకర్షించేందుకు ఇతర బాషల్లోకి సైట్ అందుబాటులోకి తెస్తామని ఫ్లిప్ కార్ట్ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి పేర్కొన్నారు. గతేడాది ‘ఎల్ఐవీ.ఏఐ’ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ)కి చెందిన స్టార్టప్ సంస్థను ఫ్లిప్ కార్ట్ కొనుగోలుచేసింది. 

దీని ద్వారా 10 భారతీయ భాషల్లో మాట్లాడిన మాటలను టెక్ట్స్ రూపంలోకి మార్చేందుకు వీలు ఉన్నది. మరో ఈ- కామర్స్ దిగ్గజం అమెజాన్ గతేడాదే హిందీ వెబ్ సైట్ ను ఆవిష్కరించింది. దీని ద్వారా 10 కోట్ల మంది వీక్షకులను ఆకర్షించడమే లక్ష్యమని అమెజాన్ అప్పట్లో తెలిపింది.  
 

click me!