లాస్ట్ ఛాన్స్!!ఫిబ్రవరిలో మొబైల్ వ్యాలెట్ల కేవైసీ లింకేజీ మస్ట్

By rajesh yFirst Published Sep 4, 2019, 11:51 AM IST
Highlights


దేశీయంగా సేవలందిస్తున్న మొబైల్ వ్యాలెట్లకు ఆర్బీఐ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. 2020 ఫిబ్రవరి నెలాఖరులోగా మొబైల్ వ్యాలెట్లు తమ ఖాతాదారులతో నో యువర్ కస్టమర్ (ఈ-కేవైసీ) ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది.

మొబైల్ వ్యాలెట్లు తమ వినియోగదారుడి గుర్తింపును నిర్ధారించే ‘నో యువర్ కస్టమర్ (ఈ-కేవైసీ) ప్రక్రియ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలనే నిబంధన గడువును రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మరోమారు పెంచింది. అయితే ఈ గడువే ఆఖరుదని స్పష్టం చేసింది. 2020 ఫిబ్రవరిలోగా మొబైల్ వ్యాలెట్లు ‘ఈ-కేవైసీ’ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుందని తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో ఆర్బీఐ పేర్కొంది. 

పేటీఎం, ఫోన్ పే, అమెజాన్ పే వంటి మొబైల్ వ్యాలెట్ సంస్థలు ఈ ఏడాది ఆగస్టు నెలాఖరుకల్లా తమ వినియోగదారుల కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని తొలుత ఆర్బీఐ గడువు విధించింది. ఇది పూర్తయితే ఎలాంటి ఆటంకాలు లేకుండా యాప్‌ల ద్వారా లావాదేవీలు జరుపుకోవచ్చునని సదరు మొబైల్ వ్యాలెట్ సంస్థలకు సూచించింది. అయితే ముందుగా నిర్దేశించిన 18 నెలల గడువులోగా కేవైసీ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో ఇప్పుడు దాన్ని 24 నెలలకు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నది.

మొబైల్ వ్యాలెట్ సంస్థ ప్రతినిధి నేరుగా తమ వినియోగదారుడి వద్దకు వెళ్లి, వారి వేలిముద్రతోపాటు పాటు అన్ని పత్రాలను ధ్రువీకరించుకోవాల్సి ఉంది. అంతుకుముందు వ్యాలెట్ సంస్థలు ఆన్‌లైన్‌లోనే స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ ప్రక్రియను పాక్షికంగా నిర్వహించేవి. 

ఇది కొంత శ్రమతో కూడుకున్న వ్యవహారం కావడంతో వినియోగదారుడితో ఫేస్ టు ఫేస్ ధ్రువీకరణ అవసరం లేకుండా సరళతరమైన విధానం అందుబాటులోకి తేవాలని ఇంతకుముందే భారతీయ చెల్లింపు మండలి (పీసీఐ) సూచించింది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ విధించిన గడువులోగా వ్యాలెట్ సంస్థలు కేవైసీ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసుకునేలా ఆధార్ సంఖ్య లేదా ఏదైనా డిజిటల్ పద్ధతిలో నిర్వహించే యోచనలో సర్కార్ ఉందని పీసీఐ ఇటీవల తెలిపింది.

click me!