నెటిజన్లకు గుడ్ న్యూస్: త్వరలోనే ట్విటర్‌లో ఎడిట్‌ ఫీచర్‌!

By rajesh yFirst Published Nov 14, 2018, 10:16 AM IST
Highlights

నిత్యం డిజిటల్ ఫార్మాట్‌లోనే వెళుతున్న మనం.. మన అభిప్రాయాలను తెలుపడానికి చేసే ట్వీట్లు ఒక్కోసారి పొరపాట్లు కావచ్చు. దీన్ని నివారించేందుకు ఎడిట్ ఫీచర్ తేనున్నామని ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సే తెలిపారు.

న్యూఢిల్లీ: మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ మేనేజ్మెంట్ త్వరలోనే ఎడిట్‌ ఆప్షన్‌ను చేర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ సీఈఓ జాక్ దోర్సే తెలిపారు. భారతదేశంలో తొలిసారి రెండు రోజులు పర్యటించిన జాక్ డోర్సె ఐఐటీ ఢిల్లీలోని టౌన్ హాలులో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ యూజర్లు తాము చేసే పోస్టుల్లో అక్షర దోషాలను నిరోధించేందుకు ఈ ఫీచర్‌పై కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ట్విట్టర్ యూజర్లు ‘పోస్ట్‌ను ఎడిట్‌ చేసే ఆప్షన్‌ను చాలా మంది వినియోగదారులు కోరుకుంటున్నారు. దీనివల్ల ఏదైనా పోస్ట్‌ చేసినప్పుడు అక్షర దోషాలు, వెబ్‌లింక్‌లను తప్పుగా ఎంటర్ చేయడం వంటి వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది’’ అని జాక్ డోర్సే అన్నారు.

ఇదే సమయంలో ఈ ఫీచర్‌ దుర్వినియోగం కాకుండా చూసేందుకు ఎక్కువ సార్లు పోస్ట్‌ను ఎడిట్‌ చేసే అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రత్యేకించి రాజకీయ నాయకులు, ప్రముఖులు సందర్భానుసారం చేసే ట్వీట్లపై విమర్శలు కూడా వస్తున్నాయి. అటువంటి రాకుండా ఉండాలంటే ఈ ఫీచర్ అవసరం అన్న అభిప్రాయం వినిపిస్తున్నది. ఒక్కోసారి స్పెల్లింగ్ తప్పులకు కూడా విమర్శలకు పాత్రులవుతున్నారన్న విమర్శలు లేకపోలేదు. అయితే సదరు ఫీచర్ పూర్వాపరాలను జాక్ డోర్సే మాత్రం బయట పెట్టకపోవడం గమనార్హం. 

తన ప్రసంగంలో నకిలీ వార్తల వ్యాప్తి గురించి డోర్సే ప్రస్తావించారు. ఈ తరహా వార్తలు విపరీతంగా వైరల్‌ అవుతున్న నేపథ్యంలో ఇంతటి క్లిష్టమైన సమస్యకు నిర్దిష్ట పరిష్కారం కష్టమని వ్యాఖ్యానించారు. రాజకీయ నాయకులు ఓటర్లను ప్రభావితం చేసేందుకు సామాజిక మాధ్యమాలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్న సంగతి తెలిసిందే. దేశంలో త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో డోర్సే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ఈ సమస్యను నియంత్రించేందుకు సాధ్యమైనంత మేర కృషి చేస్తాం. ఒకవేళ ఏదైనా సమాచారం తప్పుదోవ పట్టించేలా ఉండి, దాన్ని మేం గుర్తిస్తే అది వ్యాపించకుండా ఆపే బాధ్యత మాపై ఉంటుంది. ఏ ఉద్దేశంతో దాన్ని వైరల్‌ చేయాలని చూస్తున్నారో అది జరగకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత కూడా మాదే’ అని డోర్సే పేర్కొన్నారు.

                      

click me!