ట్రంప్ కరుణ ఇలా.. హువావేకు మరో 90 రోజుల రిలాక్స్.. బట్

By rajesh yFirst Published Aug 20, 2019, 12:11 PM IST
Highlights

హువావేకు తాత్కాలిక ఊరట ఇచ్చినట్లే ఇచ్చి దాని అనుబంధ 46 సంస్థలపై నిషేధం పొడిగించింది అమెరికా. అమెరికా తీరుపై హువావే మండిపడింది. 

న్యూఢిల్లీ‌: చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం హువావేకు ఊరట కలిగించేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు ఆ సంస్థపై అమెరికా విధించిన నిషేధాన్ని 90 రోజులు తాత్కాలికంగా ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో 90రోజుల పాటు నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. అమెరికా వాణిజ్య శాఖ మంత్రి విల్బర్‌ రోస్‌ ఈ సంగతి ప్రకటించారు. దీంతో హువావే అమెరికా కంపెనీలతో క్రయ విక్రయాలు జరపవచ్చు. 

‘హువావేతో వ్యాపార లావాదేవీలకు అమెరికా టెలికాం కంపెనీలకు మరో 90 రోజులు వెసులుబాటు ఇస్తున్నాం. పలు కంపెనీలు హువావే టెక్నాలజీపై ఆధారపడి పనిచేస్తున్నాయి. అందుకే అవి సొంతంగా సౌకర్యాలు కల్పించుకునే వరకూ వాటికి కొద్దిగా వెసులుబాటు కల్పిస్తున్నాం. ప్రత్యేకంగా లైసెన్స్‌లకు మాత్రం అనుమతులు ఇవ్వడంలేదు’ అని రోస్‌ పేర్కొన్నారు.

విదేశీ శత్రువుల నుంచి దేశంలోని కంప్యూటర్‌ నెట్‌వర్క్‌కు ముప్పు ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేషనల్‌ ఎమర్జెన్సీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా చైనా టెలికం దిగ్గజం హువావేపై నిషేధం విధించారు. 

చైనా కోసం హువావే గూఢచర్యం చేస్తోందని డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా అమెరికా సంస్థల నుంచి హువావే ఎటువంటి టెక్నాలజీని కొనుగోలు చేయకూడదని ఆంక్షలు విధించారు. 

ఆ తర్వాత ఆ ఆంక్షలను 90 రోజులు సడలిస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు మరో 90రోజుల పాటు నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేశారు. దీంతో హువావేతో అమెరికా కంపెనీలు వ్యాపార లావాదేవీలను నిర్వహించుకోవచ్చు.

అయితే హువావేపై తాత్కాలికంగా నిషేధం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన అమెరికా దొంగ దెబ్బ తీసింది. దాని 46 అనుబంధ సంస్థలపై నిషేధం పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ఎంటిటీ జాబితాలో అమెరికా చేర్చింది. అమెరికా నిర్ణయాన్ని హువావే ఖండించింది. అమెరికాలో హువావే ఫోన్ల విక్రయాలు, ఆర్థిక లావాదేవీలు జరుపుకునేందుకు అనుమతినిచ్చిన విషయమై ఆ సంస్థ ప్రతిస్పందించలేదు. 
 

click me!