రారాజుగా షియోమీ..పండుగ సేల్స్ ఎంత తెలుసా!

By Rekulapally Saichand  |  First Published Oct 27, 2019, 5:12 PM IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో స్మార్ట్‌ఫోన్‌ విక్రయాల్లో రికార్డులు నమోదయ్యాయి. మొత్తం విక్రయాల్లో షియోమీ టాప్‌ బ్రాండ్‌గా నిలిచింది. దీపావళి పండుగ కూడా రావడంతో మూడో త్రైమాసికంలో ఐదు కోట్ల స్మార్ట్ ఫోన్ల విక్రయాలు జరిగాయి. ఇక ఫోచర్ల ఫోన్ల మార్కెట్ వెలవెలబోయింది.ద్వితీయ త్రైమాసికంలో 4.9 కోట్ల స్మార్ట్ ఫోన్లు అమ్ముడు పోయాయి. 


ముంబై: దసరా, దీపావళి పండుగ సీజన్లో స్మార్ట్ఫోన్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించడంతో ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ అమ్మకాలు జోరందుకున్నాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తాజా నివేదికలో తేలింది.

అన్ని ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు కొత్త ఆవిష్కరణలు, డిస్కౌంట్లు, పండుగ ప్రత్యేక ఆఫర్లతో ఈ వృద్ధి నమోదైందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ఒక నివేదికలో తెలిపింది. డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్, నో కాస్ట్‌ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, ఆకర్షణీయ ప్రమోషన్లు ఈ పండుగ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను పెంచడంతో కీలకంగా నిలిచిందని కౌంటర్ పాయింట్  విశ్లేషకుడు అన్షిక జైన్ చెప్పారు.

Latest Videos

undefined

ఒకవైపు దేశీయంగా ఆటో, రియల్టీ సహా పలురంగాల్లో మందగమనం కొనసాగుతోంటే..స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ మాత్రం రెండంకెల వృద్ధిని నమోదు చేసింది. సెప్టెంబర్ నెలతో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో రెండంకెల (10 శాతం) వృద్దితో అత్యధికంగా 49 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. ఫలితంగా ఈ విభాగంలో మందగమనం ఆందోళనలను అధిగమించిందని ఇటీవల వెల్లడించిన ఒక నివేదికలో  పేర్కొంది. 

ముఖ్యంగా ఈ విక్రయాల్లో చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షియోమీ తన ఆధిపత్యాన్ని మరోసారి నిలబెట్టుకుంది. ఆకర్షణీయ అత్యాధునిక ఫీచర్లు, బడ్జెట్‌ ధరల్లో వివిధ స్మార్ట్‌ఫోన్లను తీసుకొస్తూ భారతీయ స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. 

26 శాతం వాటాతో షియోమీ మార్కెట్లో నిలిచింది. 20 శాతం వాటాతో శామ్ సంగ్, 17 శాతంతో వివో తర్వాతి స్థానాలను దక్కించుకున్నాయి.  ఇంకా రియల్ మీ 16 శాతం, ఒప్పో వాటా 8 శాతంగా  సాధించాయి. అయితే ఇటావల ధరలను తగ్గించిన నేపథ్యంలో ఆపిల్‌ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు పుంజుకున్నాయి. 

ఐఫోన్ 11 తో పాటు ఎక్స్‌ఆర్ మోడల్‌లో ధరల తగ్గింపు కారణంగా ఆపిల్ టాప్ 10 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లలోకి ప్రవేశించింది. అయితే నెంబర్ వన్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌గా వన్ ప్లస్ నిలిచింది. మూడో త్రైమాసికంలో ఈ కంపెనీ అమ్మకాలు రెండింతలు పెరిగాయి. 

స్మార్ట్ ఫోన్లకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఫీచర్ ఫోన్ల అమ్మకాలు  అంతంత మాత్రంగానే ఉన్నాయి. మూడో త్రైమాసికంలో దాదాపు 37 శాతం తగ్గిపోయాయి. ఫీచర్ ఫోన్ విభాగంలో శామ్‌సంగ్ మార్కెట్ వాటా 22 శాతం, ఐ టెల్ వాటా 16 శాతం, లావా వాటా 16 శాతం, నోకియా 12 శాతం, కార్బన్ 7 శాతంగా నమోదైంది. 

అయితే ఇటెల్, లావా కార్బన్ కంపెనీలు సానుకూల వార్షిక వృద్ధిని నమోదు చేశాయి. వాస్తవానికి, 2019 మూడవ త్రైమాసికంలో ఇటెల్ రెండవ ఫీచర్ ఫోన్ బ్రాండ్‌గా అవతరించిందని కౌంటర్ పాయింట్ పేర్కొంది.

click me!