ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోలో మరో విదేశీ సంస్థ భారీ పెట్టుబడులకు సిద్ధమైనట్లు తెలుస్తున్నది. జియోలో సౌదీ అరేబియాకు చెందిన సావరిన్ ఫండ్.. పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (పీఐఎఫ్) 2.33 శాతం వాటా కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ గల్ఫ్ న్యూస్ పేర్కొంది.
ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియోలో మరో విదేశీ సంస్థ భారీ పెట్టుబడులకు సిద్ధమైనట్లు తెలుస్తున్నది. జియోలో సౌదీ అరేబియాకు చెందిన సావరిన్ ఫండ్.. పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (పీఐఎఫ్) 2.33 శాతం వాటా కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ గల్ఫ్ న్యూస్ పేర్కొంది.
ఈ మొత్తం వాటాను రూ. 11 వేల కోట్ల పై చిలుకు (1.5 బిలియన్ డాలర్లకు) సౌదీ సావరిన్ పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ సొంతం చేసుకోనున్నట్లు తెలిపింది. ఇప్పటికే తొమ్మిది విదేశీ సంస్థలు జియోలో 22.38 శాతం వాటాను దక్కించుకున్నాయి. ఈ సంస్థలు జియోలో మొత్తం రూ.104,326.95 కోట్లు పెట్టుబడి పెట్టాయి.
undefined
జియోకు వచ్చిన పెట్టుబడులు ఇలా ఉన్నాయి. తొలుత ఫేస్‌బుక్ 9.99 శాతం వాటాతో రూ. 43,574 కోట్ల పెట్టుబడితో ఈ పర్వం మొదలైంది. తర్వాత సిల్వర్ లేక్ 1.15శాతం వాటాతో రూ. 5,656 కోట్లు, అటుపై విస్టా ఈక్విటీ సంస్థ 2.32శాతం వాటాతో రూ. 11,367 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించాయి.
జనరల్ అట్లాంటిక్ సంస్థ 1.34శాతం వాటాతో రూ.6,598 కోట్లు,
కేకేఆర్ 2.32శాతం వాటాతో రూ.11,367 కోట్లు, ముబదాల 1.85శాతం వాటాతో రూ.9,093 కోట్లు, సిల్వర్ లేక్ 0.93శాతం వాటాతో రూ. 4,547 కోట్లు, ఐడీఐఏ 1.16శాతం వాటాతో రూ. 5,683.5 కోట్లు, టీపీజీ 0.93శాతం వాటాతో రూ.4,546.8 కోట్లు, ఎల్ కాటర్ టన్ 0.39శాతం వాటాతో రూ. 1,894.5 కోట్లు పెట్టుబడి పెట్టాయి.
2021 వరకు సంస్థను రుణరహితంగా మార్చాలని రిలయన్స్ భావిస్తోంది. ఇందులో భాగంగానే జియో వరుస పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇందుకోసం జియోలో 25% మైనారిటీ వాటాను వాటాదార్లకు విక్రయించాలని నిర్ణయించింది. పీఐఎఫ్ ఒప్పందం కుదిరితే జియోలో వాటా విక్రయ ప్రక్రియ దాదాపు పూర్తయినట్లేనని తెలుస్తోంది.
అయితే, కరోనా ప్రభావంతో ప్రపంచమంతా సంక్షోభంలోకి జారుకున్నది. దిగ్గజ సంస్థలూ కుదేలయ్యాయి. చాలా కంపెనీలకు ఉద్యోగుల వేతనాలు చెల్లించడమే కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లోనూ జియో భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. మరోవైపు.. రిలయన్స్ రైట్స్ ఇష్యూ ద్వారా భారీగా నిధులు సమీకరించుకుంది.
ఈ స్థాయిలో నిధులు సమీకరించుకోవడంలో రిలయన్స్ వ్యూహం సంస్థను రుణరహితంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నది. దేశంలో 4జీ స్థితిగతులను పూర్తిగా మార్చేసిన జియో.. భారత టెలికాం రంగంలో ఒక సంచలనం. ప్రపంచంలో డేటా అధికంగా వినియోగిస్తున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది అంటే అందుకు కారణం జియో అన్న అభిప్రాయం ఉంది.
జియోను ఈ స్థాయికి తీసుకురావడానికి భారీగా పెట్టుబడులు పెట్టడానికి రిలయన్స్ అప్పులు కూడా భారీగానే చేయాల్సి వచ్చింది. వాటిని తీర్చి.. రుణ రహితంగా మారడమే ప్రధాన లక్ష్యంగా ఇటీవల నిధుల సమీకరణను ముమ్మరం చేసింది రిలయన్స్.
2020 మార్చి 31 నాటికి ఈ సంస్థ అప్పులు రూ. 1.6 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2021 మార్చి 31 నాటికి రుణరహితంగా మారాలన్నది రిలయన్స్ లక్ష్యం. తొలుత సౌదీ ఆరాంకోతో రూ.1.4 లక్షల కోట్ల ఒప్పందం కుదుర్చుకుని ఈ ఏడాది మార్చి 31 నాటికి పూర్తికావాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
ప్రస్తుతం కరోనా మహమ్మారి వల్ల తలెత్తిన పరిస్థితుల కారణంగా ఆరాంకో డీల్ ఆలస్యం అయ్యింది. రిఫైనరీ, పెట్రో కెమికల్ వ్యాపారాల్లో 20 శాతం వాటా విక్రయం ద్వారా ఆరాంకో నుంచి నిధులు సమకూర్చుకోవాలని రిలయన్స్ ప్రణాళిక వేసింది.
అయితే రిలయన్స్ అప్పులు తీర్చేందుకు కీలకమైన ఆరాంకో ఒప్పందం ఆలస్యమైన కారణంగా రిలయన్స్ 'ప్లాన్-బి'ని అమలు చేసింది. విదేశీ సంస్థల నుంచి టెలికాం విభాగం ద్వారా నిధులు సమీకరించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఇటీవల జియోలోకి వరుస పెట్టుబడులను రాబట్టగలిగింది.
ఆరాంకో ఒప్పందం ఆలస్యమైనా సంస్థను రుణ రహితంగా మార్చేందుకు ప్లాన్-బి విజయవంతమవుతున్నట్లు బ్రోకరేజీ సంస్థ ఎడిల్వైస్ అంచనా వేసింది. ఆరాంకో డీల్ ఇప్పట్లో లేకున్నా రిఫైనరీ వ్యాపారాల్లో 49 శాతం రిటైలింగ్ వాటాను రూ.7వేల కోట్లకు బ్రిటన్‌కు చెంది బ్రిటిష్ పెట్రోలియంకు విక్రయిస్తున్నట్లు ముకేశ్ అంబానీ గతంలో ప్రకటించారు.
వీటికి తోడు జియోకు వచ్చిన పెట్టుబడి నిధులతో రిలయన్స్ రుణరహితంగా మారేందుకు అవకాశాలు ఉన్నాయని ఎడ్విలైన్ తెలిపింది. జియో ప్లాట్ ఫామ్స్‌లో దాదాపు 20 శాతం వాటా విక్రయం, ఇంధన వ్యాపారాల్లో బీపీకి వాటా బదిలీ, రైట్స్ ఇష్యూ ద్వారా రిలయన్స్‌కు మొత్తం రూ.1.3 లక్షల కోట్ల సమకూర్చుకుంటుందని అంచనా. దీనితో అప్పులు లేని సంస్థగా అవతరించేందుకు అవసరమైన నిధులు దాదాపుగా సమకూరినట్లేనని ఎడిల్వైస్ అభిప్రాయపడింది.