షియోమీతో సై.. మార్కెట్‌పై పట్టు కోసం శామ్‌సంగ్ ప్లాన్

By Siva KodatiFirst Published Feb 15, 2019, 1:30 PM IST
Highlights

దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ మేజర్ శామ్‌సంగ్ మార్కెట్లో తన స్థానాన్ని తిరిగి పొందేందుకు వ్యూహాలు రచిస్తోంది. అతిపెద్ద మార్కెట్ భారతదేశంలో నాలుగు బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని సముపార్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.

దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం శామ్ సంగ్ విపణిలో తన పట్టు మళ్లీ బిగించేందుకు సిద్ధమవుతోంది. చైనా మేజర్ షియోమీ రాకతో మొదటి స్థానంలో ఉన్న శామ్‌సంగ్.. గతేడాది సేల్స్‌లో సెకండ్ ప్లేస్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

ఈ క్రమంలో తమ విక్రయాలను ఈ ఏడాది చివరిలోగా నాలుగు బిలియన్ల డాలర్ల (రూ.28 వేల కోట్ల)కు చేరుకోవాలని శామ్‌సంగ్ లక్ష్యంగా పెట్టుకున్నది. మొత్తం తమ పోర్ట్ ఫోలియోను స్రుష్టించాలని నిర్ణయించామని శామ్‌సంగ్ ఇండియా సీనియర్ ఉపాధ్యక్షుడు రంజీవ్ సింగ్ తెలిపారు.

అందుకోసం ‘ఏ’ సిరీస్ ఫోన్లను వచ్చేనెలలో ఆవిష్కరిస్తామన్నారు. మిలినియల్స్‌ను లక్ష్యంగా చేసుకుని రూ.10 నుంచి రూ.50 వేల లోపు మోడల్ ఫోన్లను ఆవిష్కరిస్తామన్నారు. ఈ ఫోన్లన్నీ ఆఫ్ లైన్, ఆన్ లైన్ చానళ్లలో విక్రయిస్తామని శామ్‌సంగ్ ఇండియా సీనియర్ ఉపాధ్యక్షుడు రంజీవ్ సింగ్ చెప్పారు.

ఈ ఏడాది సింగిల్ సిరీస్‌లోనే భారతదేశంలో నాలుగు బిలియన్ల డాలర్ల ఆదాయం సంపాదించాలని లక్షంగా పెట్టుకున్నామన్నారు. చైనాలోని ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థలు షియోమీ, ఒప్పో, వివో బ్రాండ్లతో శామ్ సంగ్ సంస్థ తలపడుతోంది.

2018లో శామ్ సంగ్ ఇండియా నికర లాభం 11 శాతం పెరిగి రూ.3,712.7 కోట్లకు చేరుకుంటే, ఆదాయం 10 శాతం పురోగతితో రూ.61,065 కోట్లకు మాత్రమే పరిమితమైంది. అందులో మొబైల్ ఫోన్ల విభాగంలో సంస్థ భారత్ ఆదాయం రూ.37,349 కోటలకు పరిమితమైంది. 

భారతదేశంలో శామ్‌సంగ్ ఆఫ్‌లైన్ చానల్‌లో 1.80 లక్షల రిటైల్ ఔట్ లెట్లు, 2000 బ్రాండ్ స్టోర్లు ఉన్నాయి. ఇటీవల శామ్ సంగ్ మార్కెట్లోకి విడుదల చేసిన ఎం సిరీస్ ఫోన్లతో ఏ సిరీస్ ఫోన్లు తలపడనున్నాయి. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మార్కెట్లోకి ఉత్పత్తులు తేవడమే తమ లక్ష్యమని శామ్‌సంగ్ వాదిస్తోంది.  

click me!