*రిలయన్స్ జియో నుంచి మరో ఫోన్
*బడ్జెట్ ధరలో జియో ఫోన్
టెలికాం రంగంలో సంచలనాలు సృష్టించిన రిలయన్స్ జియో.. మొబైల్ రంగంలోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. గతేడాది జియో 4జీ ఫీచర్ ఫోన్‌ను విడుదల చేయగా.. ఈ ఫోన్ మార్కెట్‌లో విజయం సాధించింది. ఎన్నో లక్షల మంది ఈ ఫోన్‌ను కొనుగోలు చేశారు. దీంతో ఆ సక్సెస్‌ను దృష్టిలో ఉంచుకుని రిలయన్స్ సంస్థ జియో ఫోన్ 2 పేరిట ఆ ఫోన్‌కు కొనసాగింపుగా నూతన ఫీచర్ ఫోన్‌ను ఈ రోజు విడుదల చేసింది. రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఈ రోజు జరిగిన ఆ సంస్థ 41వ వార్షిక సమావేశంలో జియో ఫోన్ 2పై ప్రకటన చేశారు.
జియో ఫోన్ 2 ధర రూ.2,999 గా నిర్ణయించినట్లు ముకేష్ వెల్లడించారు. ఈ ఫోన్ ఆగస్టు 15వ తేదీ నుంచి మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తుందన్నారు. అలాగే ఈ నెల 21వ తేదీ నుంచి ఈ ఫోన్‌కు గాను బుకింగ్స్ ప్రారంభమవుతాయని, ఇప్పటికే జియో ఫోన్‌ను వాడేవారు ఆ ఫోన్‌ను ఇచ్చేసి రూ.501 అదనంగా చెల్లిస్తే దాంతో జియో ఫోన్ 2 ను సొంతం చేసుకోవచ్చని తెలిపారు. జియో ఫోన్ మాన్‌సూన్ హంగామా ఆఫర్ కింది ఎక్స్‌ఛేంజ్‌ను అందిస్తున్నట్లు తెలిపారు.
జియో ఫోన్ 2 లో ఫీచర్ల విషయానికి వస్తే.. 2.4 ఇంచుల డిస్‌ప్లే, కాయ్ ఓఎస్, 512 ఎంబీ ర్యామ్, 4జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, వీజీఏ సెల్ఫీ కెమెరా, 2000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ వీవోఎల్‌టీఈ, వీవోవైఫై, ఎన్‌ఎఫ్‌సీ తదితర ఫీచర్లు జియో ఫోన్ 2 లో లభిస్తున్నాయి. ఈ ఫోన్ డిస్‌ప్లే కింది భాగంలో క్వర్టీ కీప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. దీని వల్ల ఫోన్ బ్లాక్‌బెర్రీ క్వర్టీ ఫోన్‌ను పోలి ఉంటుంది. ఇక ఈ ఫోన్‌లో వాట్సాప్, ఫేస్‌బుక్, యూట్యూబ్ యాప్స్ పనిచేస్తాయి. అంతేకాకుండా వాయిస్ కమాండ్లను ఇచ్చేందుకు ప్రత్యేకంగా బటన్‌ను ఏర్పాటు చేశారు.