వచ్చే ఏడాది నియామకాల సెంటిమెంట్ బాగానే పుంజుకుంటుందని ఇండియా స్కిల్స్ నివేదిక తెలిపింది. ఐటీ, ఆటోమొబైల్, ప్రయాణం, ఆతిథ్య రంగాల్లో ఉద్యోగ నియామకాలు ఉంటాయని అంచనా వేసింది. కాకపోతే 2010-11 మాదిరిగా భారీస్థాయిలో ఉండకపోవని పేర్కొనడం ఆ నివేదిక కొసమెరుపు.
వచ్చే ఏడాది ఉద్యోగాల జాతర ఉంటుందని ఇండియా స్కిల్స్ నివేదిక పేర్కొంది. నాలుగేళ్ల తర్వాత 2019లో భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), ఆటోమోటివ్, ట్రావెల్, ఆతిద్య రంగాలు ఉద్యోగ కల్పనలో కీలకం కానున్నాయని ఇండియా స్కిల్స్ నివేదిక పేర్కొంది.
కొత్త ఏడాదిలో నియామకాలు సానుకూలంగా ఉంటాయని దాదాపు 64 శాతం కంపెనీలు తెలుపగా, 20 శాతం సంస్థలు 2018లో తీసుకున్న సంఖ్యలోనే నియమించుకోవచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారని నివేదిక తెలిపింది. ఇక ఫ్రెషర్స్ నియామకాలు దాదాపు 15 శాతం వరకు ఉంటాయని పేర్కొన్నట్లు తెలిపింది. 2017తో ఫ్రెషర్స్ నియామకాలు 7 శాతంగా ఉండగా 2019లో 15 శాతానికి పెరగనుండటం విశేషమని తెలిపింది.
అయినా 2010-11 స్థాయిని అందుకోవటం కష్టమే
కొత్త ఏడాదిలో నియామకాలు భారీ స్థాయిలో ఉంటాయని అంచనా వేస్తున్నా 2010-11 స్థాయిని అందుకోవటం కష్టమేనని ఇండియా స్కిల్స్ స్పష్టం చేసింది. గడచిన రెండు మూడేళ్లతో పోల్చితే మాత్రమే నియామాకాలు మెరుగ్గా ఉంటాయని భావిస్తున్నట్లు తెలిపింది.
undefined
2018లో కూడా ఉద్యోగ నియామకాలు సానుకూలంగా ఉన్నాయని. ఆర్థిక వ్యవస్థలో సానుకూల ధోరణులు ఉండటంతో వచ్చే ఏడాది పెద్ద ఎత్తున ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయని పీపుల్‌స్ట్రాంగ్ కో ఫౌండర్, సీఈవో పంకజ్ బన్సాల్ వెల్లడించారు.
వచ్చే ఏడు ఐటీ హైరింగ్ హై
కొత్త ఏడాదిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో హైరింగ్ పెద్ద ఎత్తున ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు. డిజైన్, అనలిటిక్స్ విభాగాల్లో ఉద్యోగాలు అందుబాటులోకి రావటంతో పాటు ప్రత్యేక టెక్నాలజీలైన ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) రంగాలు ఉద్యోగాల కల్పనలో కీలకంగా ఉండనున్నాయని తెలిపారు. ఐటీ రంగం తర్వాత ఉద్యోగాల కల్పనలో ఇంజనీరింగ్, ఆటోమోటివ్, ట్రావెల్, హాస్పిటాలిటీ రంగాలు కూడా జోరుగా నియామకాలు చేపట్టనున్నాయని తెలిపారు.
వేతనాల్లో బెంగళూరు టాప్
భారత్‌లో అత్యధిక వేతనాలను చెల్లిస్తున్న రంగాల్లో హార్డ్‌వేర్.. నెట్‌వర్కింగ్, సాఫ్ట్‌వేర్.. ఐటీ సర్వీసులు, కన్స్యూమర్ రంగాలు.. తొలి మూడు స్థానాల్లో ఉన్నాయని లింక్డిన్ వెల్లడించింది. లింక్డిన్ తన ప్లాట్‌ఫామ్ ద్వారా దేశవ్యాప్తంగా శాలరీ స్టడీ పేరుతో తొలిసారిగా ఒక సర్వేను చేపట్టింది.
గరిష్ఠ స్థాయిలో వేతనాలను చెల్లిస్తున్న నగరాల్లో భారత సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరు అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై ఉన్నాయని లింక్డిన్ తెలిపింది. హార్డ్‌వేర్, నెట్‌వర్కింగ్ రంగంలో వార్షిక వేతనం సగటున రూ.15 లక్షలుగా ఉండగా, ఐటీ, సాఫ్ట్‌వేర్ రంగంలో రూ.12 లక్షలు, కన్స్యూమర్ రంగంలో రూ.9 లక్షలుగా ఉన్నాయని పేర్కొంది.
చిప్ డిజైన్, న్యూ ఏజ్ టెక్నాలజీలకు ఫుల్ డిమాండ్
బెంగళూరులో సగటు వార్షిక వేతనం రూ.11,67,337 కాగా, ముంబైలో రూ.9,03,929, ఢిల్లీ ఎన్‌సీఆర్ రీజియన్ రూ.8,99,486, హైదరాబాద్ రూ.8,45,574, చెన్నై రూ.6,30,920గా ఉన్నాయని లింక్డిన్ తెలిపింది. సాఫ్ట్‌వేర్ రంగంతో పోల్చితే హార్డ్‌వేర్ రంగంలో పెద్దఎత్తున వేతనాలు ఆఫర్ చేస్తున్నారని.. చిప్ డిజైన్, న్యూ ఏజ్ నెట్‌వర్కింగ్ వంటి టెక్నాలజీలకు డిమాండ్ పెరుగుతుండటంతో ఈ రంగంలోని వారికి భారీ ఆఫర్‌ను అందించేందుకు కంపెనీలు వెనుకాడటం లేదని పేర్కొంది. రెండు మూడేళ్ల అనుభవం కలిగిన వారికి కూడా ఈ రంగం పెద్దపీట వేస్తోందని తెలిపింది.
పెరిగిన మహిళా ఉద్యోగులు
కాగా 2018లో మహిళా ఉద్యోగ కల్పన 38 శాతం నుంచి 46 శాతానికి పెరిగిందని ఇండియా స్కిల్స్ తెలిపింది. ఇదే సమయంలో పురుషుల ఉద్యోగ కల్పన స్వల్పంగా 47 శాతం నుంచి 48 శాతానికి పెరిగిందని పేర్కొంది. 2019లో చేపట్టనున్న నియామకాల్లో మహిళా ఉద్యోగుల వాటా దాదాపు 15-20 శాతంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో ఉద్యోగాల కల్పనలో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ రాష్ట్రాలు టాప్ 3లో ఉన్నాయని ఇండియా స్కిల్స్ నివేదిక పేర్కొంది.