హువావే ‘అమెరికా’ స్టాఫ్ ఇక ఇంటికే!?

By rajesh yFirst Published Jul 15, 2019, 10:37 AM IST
Highlights

అమెరికా నిషేధం విధించడంతో తన ఖర్చు తగ్గించుకునే పనిలో పడింది చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ‘హువావే’. అందులో భాగంగా అమెరికాలోని యూనిట్లు మూసివేసి.. సుమారు 850 మంది అమెరికన్లను ఇంటికి సాగనంపనున్నది. చైనీయులకు మాత్రం సొంత దేశంలో పని చేసే ఆప్షన్లు కల్పిస్తోంది. 

బెంగళూరు: చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ‘హువావే’ అమెరికాలోని తన ఉత్పాదక యూనిట్లలో భారీగా లేఆఫ్స్ ప్రకటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. నిఘా పెడుతున్నదన్న సాకుతో హువావేపై అమెరికా నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

అమెరికా ఈ సంస్థను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చడంతో ఆ సంస్థ అవస్థలు పడుతోంది. దీంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అమెరికాలోని సంస్థ యూనిట్లలో లేఆఫ్ ప్రకటించేందుకు హువావే సిద్ధమైందని ఆ సంస్థ సన్నిహిత వర్గాలను ఉటంకిస్తూ అమెరికాకు చెందిన ఓ ఆంగ్ల దినపత్రిక తెలిపింది. 

అమెరికాలోని పరిశోధనా, అభివృద్ధి విభాగమైన ఫ్యూచర్‌వే టెక్నాలజీలోని 850 మందిని తొలగించవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే ఫ్యూచర్‌వే కంపెనీలో ఉద్యోగులను హువావేలోని తమ సహచరులతో ఫోన్‌లో మాట్లాడకుండా ఆంక్షలు విధించారు.

మే 16వ తేదీ నుంచి ఈ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఇక్కడ చిన్న మెలిక ఉంది. హువావేలో పనిచేస్తున్న అమెరికన్లను మాత్రం తొలగించనున్నట్లు తెలిసింది. ఇక చైనీయులకు మాత్రం స్వదేశంలో పనిచేసే అప్షన్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని కంపెనీకి చెందిన అధికారి ఒకరు బయట పెట్టారు.

గతవారం అమెరికా వాణిజ్యశాఖ మంత్రి విల్బర్ రోజ్ మాట్లాడుతూ బ్లాక్ లిస్టెడ్ హువావేకు విక్రయిస్తున్న సంస్థలకు లైసెన్సులు మంజూరు చేస్తామన్నారు. అయితే ఆ సంస్థలు సరఫరా చేసే వస్తువుల వల్ల దేశ భద్రతకు ముప్పు వాటిల్లరాదని పేర్కొన్నారు. దీనిపై స్పందించేందుకు ‘హువావే’ నిరాకరించింది. 
 

click me!