త్వరలో ఇండియన్ సెమీకండక్టర్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు : కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్

By Siva Kodati  |  First Published Jan 25, 2024, 4:24 PM IST

కేంద్ర ప్రభుత్వం త్వరలో డిజిటల్ ఇండియా ఫ్యూచర్ ల్యాబ్స్, ఇండియన్ సెమీకండక్టర్ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుందని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు.


కేంద్ర ప్రభుత్వం త్వరలో డిజిటల్ ఇండియా ఫ్యూచర్ ల్యాబ్స్, ఇండియన్ సెమీకండక్టర్ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుందని కేంద్ర సమాచార సాంకేతిక శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. గురువారం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన IESA విజన్ సమ్మిట్ 2024లో రాజీవ్ చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని రంగాలకు ఫ్యూచర్ ప్రూఫ్ సెమీకండక్టర్ ఆవిష్కరణకు కేంద్రంగా పనిచేసే ఇండియన్ సెమీకండక్టర్ రీసెర్చ్ సెంటర్‌ను త్వరలో నెలకొల్పనున్నామన్నారు. 

త్వరలో మరో ప్రాజెక్టును ప్రారంభించనున్నామని, డిజిటల్ ఇండియా ఫ్యూచర్‌లాబ్స్ పేరుతో ఈ ప్రాజెక్ట్ ప్రభుత్వ ప్రయోగశాలలు, భారతీయ స్టార్టప్‌లు, ఎలక్ట్రానిక్స్ రంగ సంస్థలతో కూడిన జాయింట్ వెంచర్ అవుతుందని రాజీవ్ చంద్రశేఖర్ ఆకాంక్షించారు. ఇది టైర్ 1 సరఫరాదారులు,  ఆటోమోటివ్ పరిశ్రమతో సహా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా సాంకేతికతపై దృష్టి పెడుతుందని కేంద్ర మంత్రి తెలిపారు.

Latest Videos

డిజిటల్ ఇండియా ఫ్యూచర్‌ల్యాబ్స్ భారతదేశ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి పరిశోధన, ఆవిష్కరణల కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఇది స్థిరమైన అభివృద్ధి, సాంకేతిక పురోగతిని ప్రోత్సహించడంతో పాటు దేశీయ ఆవిష్కరణలను మరింత బలోపేతం చేస్తుందని రాజీవ్ చంద్రశేఖర్ ఆకాంక్షించారు. ఫ్యూచర్‌లాబ్స్, C-DAC నోడల్ ఏజెన్సీతో కలిసి, ఆటోమోటివ్, టెలికాం, ఎలక్ట్రానిక్స్‌ సహా తదితర రంగాలపై దృష్టి సారిస్తుందన్నారు. స్టార్టప్ కంపెనీలు , బహుళజాతి సంస్థల మధ్య సహకారాన్ని కూడా సులభతరం చేస్తుంది అని మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వివరించారు.

 

 

ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న దూరదృష్టితో కూడిన చర్యలను మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ హైలైట్ చేశారు. స్టార్టప్‌లు, భారీ కంపెనీలకు ప్రస్తుతం ప్రోత్సహం పెరిగిందని పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆవిష్కరణలను ప్రోత్సహించడం, స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడం వల్ల పరిశ్రమలో గణనీయమైన విజయాలను సాధిస్తున్నామని రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఎన్నో స్టార్టప్‌లు పెట్టుబడి అవకాశాలు సృష్టించడం మనం చూస్తున్నామని, ఇది వినూత్న వాతావరణాన్ని సృష్టిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. 

ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సెమీకండక్టర్ రంగాన్ని విస్తరించేందుకు మౌలిక సదుపాయాలు , పెట్టుబడులను సృష్టించిందని రాజీవ్ అన్నారు. టెక్నాలజీ రంగంలో ఈ పురోగతి ప్రపంచవ్యాప్తంగా డిజిటలైజేషన్ కారణంగా పెరుగుతున్న డిమాండ్లను తీర్చగల సామర్థ్యాన్ని నిర్ధారిస్తుందన్నారు. దీని ప్రభావం ఆటోమొబైల్, కంప్యూటర్, వైర్‌లెస్ టెలికమ్యూనికేషన్ , ఇండస్ట్రియల్ అప్లికేషన్స్ రంగాలకు విస్తరించింది అని రాజీవ్ చంద్రశేఖర్ వివరించారు. 

click me!