ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్: ఈ ఏడాది భారత్‌లోనే ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్

By telugu news team  |  First Published Feb 28, 2020, 3:07 PM IST

భారతదేశంలోని ఐఫోన్ ప్రేమికులకు ఆపిల్ శుభవార్తను అందించింది. ఈ ఏడాదిలో ఆన్ లైన్‌లో స్టోర్‌రూమ్ ప్రారంభించనున్నది. వచ్చే ఏడాది ఆఫ్ లైన్ షోరూమ్ ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ సీఈఓ టిమ్ కుక్ సంకేతాలివ్వడమే దీనికి ఉదాహరణ.
 


గ్లోబల్ టెక్ దిగ్గజం ఆపిల్ భారతదేశంలోని తన కస్టమర్లకు ఊరటనివ్వనున్నది. ఈ ఏడాది మూడవ త్రైమాసికంలో తన సొంత ఆన్‌లైన్‌ స్టోర్‌ను ప్రారంభించనున్నట్టు ధృవీకరించింది. అలాగే భారతదేశంలో 2021 నాటికి తొలి ఆపిల్ బ్రాండెడ్ ఫిజికల్ స్టోర్ ఏర్పాటు కానున్నదని స్వయంగా ఆపిల్‌ సీఈఓ టిమ్ కుక్ ప్రకటించారు. తద్వారా భారత వినియోగ దారులకు నేరుగా ఆన్‌లైన్‌లోనే ఐఫోన్లను అందుబాటులోకి తేనున్నది.

ఆపిల్ ప్రస్తుతం తన ఉత్పత్తులను థర్డ్‌పార్టీ రిటైలర్ల ద్వారా విక్రయిస్తోంది. ఇప్పటివరకు దేశంలో నేరుగా కాకుండా అమెజాన్‌, క్రోమా వంటి థర్డ్‌ పార్టీ మాధ్యమాల ద్వారా ఆపిల్‌ తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది. 

Latest Videos

undefined

కాలిఫోర్నియాలో జరిగిన సంస్థ వార్షిక వాటాదారుల సమావేశంలో టిమ్‌ కుక్‌ మాట్లాడుతూ భారతదేశంలోని దేశీయ భాగస్వామితో కాకుండా తామే స్వయంగా స్టోర్‌ను ప్రారంభించాలని చూస్తున్నామని టిమ్ కుక్ చెప్పారు. దీనికి సంబంధించిన అనుమతులను భారత  ప్రభుత్వం నుండి పొందాల్సి ఉన్నదన్నారు. తమ బ్రాండ్‌ను మరెవరో​ నడపాలని తాను కోరుకోవడం లేదన్నారు. 

తమకు భారత్ చాలా కీలకమైన మార్కెట్ అని గట్టిగా విశ్వసించే టిమ్ కుక్ ఈ ఏడాది జూన్, జూలై మధ్య భారతదేశంలో పర్యటించనున్నారు. భారత్‌లో వ్యాపారం, తయారీ ప్రణాళికలు, ఎగుమతులు, ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ ఆపిల్ దుకాణాల విస్తరణతో సహా పలు అంశాలను ఆయన పరిశీలించనున్నారు. 

గతేడాది ఆగస్టులో భారత ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను సడలించిన నేపథ్యంలో 2020 జనవరి, మార్చి మధ్య ఆపిల్ తన మొదటి ఆన్‌లైన్ స్టోర్‌ను ముంబైలో ప్రారంభించనుందని వార్తలు వచ్చాయి. లాజిస్టికల్ సమస్యలతో ఈ ప్రయత్నాలను వాయిదా వేసినట్టు సమాచారం. కానీ, సంస్థ మాత్రం అధికారింగా ఎక్కడ ఏర్పాటు చేస్తామనేది వెల్లడించలేదు.

కాగా  డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆపిల్ భారతదేశంలో 9.25 లక్షల ఐఫోన్లను రవాణా చేసిందని పరిశోధనా సంస్థ కెనాలిస్ అంచనా. ఈ సంఖ్య సంవత్సరంలో దాదాపు 200 శాతం పెరిగింది. అయితే దేశంలో ఎలక్ట్రానిక్‌ వస్తువుల దిగుమతులపై కేంద్రం విధించిన భారీ దిగుమతి సుంకం ఆపిల్‌కు భారతీయ స్మార్ట్‌మార్కెట్లో  పెద్ద సవాల్‌గా మిగిలింది.

ఈ నేపథ్యంలోనే ఆపిల్ కాంట్రాక్టర్లు ఫాక్స్కాన్, విస్ట్రాన్ సహకారంతో ఐఫోన్ల అసెంబ్లింగ్‌  ద్వారా పలు రకాల ఐఫోన్ మోడళ్లను తక్కువ ధరలకు అందుబాటులోకి తెచ్చింది. దేశంలో సొంత దుకాణాలను ప్రారంభించే ముందు సబ్సిడీ, దిగుమతి సుంకాల సడలింపుపై  భారత ప్రభుత్వంతో గత కొంతకాలంగా చర్చిస్తున్న సంగతి తెలిసిందే. 

భారత్‌లో తమ సొంతంగా విక్రయాలను ప్రారంభించేందుకు యాపిల్‌ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తోంది. కానీ, గతంలో ఉన్న నిబంధనల కారణంగా యాపిల్ భారత్‌లో సొంతంగా విక్రయించలేకపోయింది. 

click me!