యాక్సిస్ ప్లస్ మాస్టర్ కార్డుతో ఫ్లిప్‌కార్ట్‌ ‘క్రెడిట్‌ కార్డ్‌’

By rajesh yFirst Published Jul 12, 2019, 10:44 AM IST
Highlights


ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్, డిజిటల్ చెల్లింపుల సంస్థ మాస్టర్ కార్డుల సహకారంతో ఆన్ లైన్ రిటైల్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ వినియోగదారులకు కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డును జారీ చేసింది. 

న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్ లైన్ రిటైల్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. యాక్సిస్‌ బ్యాంక్‌, మాస్టర్‌ కార్డ్‌తో కలిసి కో-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డును వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఎంపిక చేసిన వినియోగదార్లకు మాత్రమే తొలుత అందించనుంది.

భవిష్యత్‌లో అందరికీ విస్తరింపజేయాలని ఫ్లిప్ కార్ట్ ప్రణాళికలు రూపొందించింది. ఈ కార్డు ద్వారా ఫ్లిప్‌కార్ట్‌, మింత్ర, 2 గుడ్‌లో కొనుగోలుపై 5 శాతం అన్‌లిమిటెడ్‌ క్యాష్‌బ్యాక్‌ లభిస్తుంది. 

దీంతో పాటు మేక్‌ మైట్రిప్‌, గో ఇబిబో, ఉబర్‌, పీవీఆర్‌, క్యూర్‌ఫిట్‌, అర్బన్‌ క్లాప్‌ వంటి వెబ్‌సైట్లలో 4 శాతం అన్‌లిమిటెడ్‌ క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. ఇతర రిటైల్‌ కొనుగోలుపై 1.5 శాతం దాకా క్యాష్‌బ్యాక్‌  లభించనుంది. ఈ క్యాష్‌బ్యాక్‌ మొత్తం ప్రతినెలా వినియోగదారుడి ఖాతాలో జమ అవుతుంది. 

దీంతో పాటు వెల్‌కమ్‌ ఆఫర్‌ కింద సుమారు 4000 రెస్టారెంట్లలో 20 శాతం దాకా డిస్కౌంట్‌, ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌ యాక్సెస్‌, పెట్రోల్‌/డీజిల్‌ కొనుగోలుపై నెలకు రూ.500 వరకు సర్‌ఛార్జి రుసుము తగ్గింపు వంటి ఆఫర్లు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ కార్డు పొందేందుకు, వార్షిక రుసుము కింద రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. 

రూ.2లక్షల కంటే ఎక్కువ వస్తువులు కొనుగోలు చేస్తే ఈ మొత్తం కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. గతంలో యాక్సిస్‌ బ్యాంక్‌తో కలిసి 2016లో సైతం యాక్సిస్‌ బ్యాంక్‌ బజ్‌ క్రెడిట్‌ కార్డును ఫ్లిప్‌కార్ట్‌ తీసుకొచ్చింది. 

ఇక స్నాప్‌డీల్‌ (హెచ్‌డీఎఫ్‌సీ), ఐఆర్‌సీటీసీ (ఎస్‌బీఐ), అమెజాన్‌ (ఐసీఐసీఐ) ఇప్పటికే కో బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డులను తీసుకొచ్చాయి. పేటీఎం, ఓలా సైతం ఇలాంటి కార్డులను ఇటీవలే విడుదల చేశాయి.

click me!