ఫేస్‌బుక్ గ్లోబల్ అఫైర్స్ చీఫ్ గా బ్రిటన్ మాజీ డీప్యూటీ ప్రధాని నిక్ క్లాగ్

By narsimha lode  |  First Published Oct 20, 2018, 12:00 PM IST

డేటా తస్కరణ, దుర్వినియోగం తదితర విమర్శలతో సతమతం అవుతున్న సోషల్ మీడియా దిగ్గజం ‘ఫేస్ బుక్’ సత్వరం ప్రక్షాళన చర్యలు చేపట్టింది


న్యూయార్క్: డేటా తస్కరణ, దుర్వినియోగం తదితర విమర్శలతో సతమతం అవుతున్న సోషల్ మీడియా దిగ్గజం ‘ఫేస్ బుక్’ సత్వరం ప్రక్షాళన చర్యలు చేపట్టింది. బ్రిటన్ మాజీ డిప్యూటీ ప్రధాని నిక్ క్లగ్ ను సంస్థ అంతర్జాతీయ వ్యవహారాలు, కమ్యూనికేషన్ల విభాగం అధిపతిగా నియమించుకున్నది.  బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కేమరూన్‌కు నిక్ క్లగ్ 2010 - 15 మధ్య డిప్యూటీగా పని చేశారు. అంతేకాదు సిలికాన్ వ్యాలీలో అత్యంత సీనియర్ యూరోపియన్ రాజకీయ వేత్త కూడా. 

నిక్ క్లాగ్ నియామకం సంగతి ఫేస్ బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్ బర్గ్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ షెర్ల్య్ శాండ్ బర్గ్ లకు మాత్రమే తెలుసు. వచ్చే వేసవిలో నిక్ క్లాగ్ సంస్థ గ్లోబల్ అపైర్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగం చీఫ్ గా బాధ్యతలు స్వీకరిస్తారు. తమ సంస్థ ప్రయాణం కీలక దశలో ఉన్నప్పుడు మార్పు దిశగా వెళ్లేందుకు నూతన ద్రుక్పథం కల వ్యక్తులు అవసరం ఉందని ఫేస్ బుక్ సీఓఓ శాండ్ బర్గ్ తన ఖాతాలో పోస్ట్ చేశారు. 

Latest Videos

undefined

నూతన సంవత్సర ప్రారంభంలో నిక్ క్లగ్ తన కుటుంబంతో కలిసి కాలిఫోర్నియాకు షిఫ్ట్ అవుతారు. సోషల్ నెట్ వర్క్ డీల్స్, వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన కుంభకోణాలు, నకిలీ వార్తల వ్యాప్తి, ఎన్నికల్లో సమాచార దుర్వినియోగం తదితర అంశాల పరిష్కారంపై ఆయన ద్రుష్టి సారించనున్నారు. 

ఫేస్ బుక్ గ్లోబల్ అఫైర్స్ అండ్ కమ్యూనికేషన్స్ చీఫ్ గా తన విధులు క్లిష్టతరమైనవని నిక్ క్లాగ్ పేర్కొన్నారు. తనలో గల నైపుణ్యం నూతన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేందుకు ఉపకరిస్తుందని భావిస్తున్నానని పేర్కొన్న నిక్ క్లాగ్ ఒక అడ్వకేట్. ఈయూలో బ్రిటన్ కు సభ్యత్వం కోసం గట్టిగా వాదించిన నేతల్లో ఒకరు ఆయన. ప్రస్తుతం ఫేస్ బుక్ పబ్లిక్ పాలసీ ఫర్ యూరప్, మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా వ్యవహారాల విబాగం ఉపాధ్యక్షుడు రిచర్డ్ అలన్ తో కలిసి నిక్ క్లాగ్ పని చేయనున్నారు. 

గతేడాది నుంచి ఫేస్ బుక్ సంస్థ యాజమాన్యాన్ని పలు సమస్యలు చుట్టుముట్టాయి. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తప్పుడు సమాచారం ప్రచారం చేయడానికి ఫేస్ బుక్ ను రష్యా ఏజంట్లు దుర్వినియోగం చేశారని విమర్శలు ఉన్నాయి. కానీ దీన్ని రష్యా నిరాకరిస్తోంది. కేంబ్రిడ్జి అనలిటికా అనే రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ 8.7 కోట్ల మంది ఫేస్ బుక్ ఖాతాదారుల డేటాను దొంగిలించిందన్న విమర్శలు వచ్చాయి. ఖాతాదారుల వ్యక్తిగత గోప్యత విషయమై ఫేస్ బుక్ శ్రద్ద వహించలేదన్న ఆరోపణలపైనా దర్యాప్తు జరుగుతోంది. 
 

click me!