తెలుగు రాష్ట్రాలకు బీఎస్ఎన్ఎల్ బోనంజా ‘స్టార్ మెంబర్‌షిప్’

By rajesh yFirst Published Jul 24, 2019, 4:00 PM IST
Highlights
  • మనుగడ కోసమే అష్టకష్టాలు పడుతున్న ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తెలుగు రాష్ట్రాల వినియోగదారులకు ‘స్టార్ మెంబర్‌షిప్’ ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. 
  • రూ.498 చెల్లిస్తే ఏడాది పాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. నెలవారీగా మాత్రం వినియోగదారులు తమ ఫోన్లను రీచార్జీ చేసుకోవాల్సిందే.

ముంబై: ఒకవైపు పూర్తిగా వాటాల విక్రయం దిశగా ప్రయాణిస్తున్న ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్‌లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్‌) ఎలాగైనా ఇతర సంస్థలతో పోటీ పడాలని భావిస్తోంది. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. 

బీఎస్ఎన్ఎల్ స్టార్‌ మెంబర్‌షిప్ ప్రోగామ్‌ను ప్రారంభించింది. రూ. 498లకు సరికొత్త స్టార్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ముఖ్యంగా భారతీ ఎయిర్‌టెల్‌ థాంక్స్ లాయల్టీ ప్రోగ్రామ్‌కు ధీటుగా ఈ సరికొత్త ఎత్తుగడతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. 

త్వరలోనే  అన్ని సర్కిళ్లలోను అమలు చేయనున్న స్టార్‌  ప్రీపెయిడ్‌ రీచార్జ్‌ ప్లాన్‌ ప్రస్తుతానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో అందుబాటులో ఉంది. దీని ప్రకారం 30 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, 30జీబీ డేటా, 1000 ఎస్సెమ్మెస్‌లు ఉచితం. 

స్టార్ మెంబర్ షిప్ వాలిడిటీ 365 రోజులు. కానీ, ఈ ప్లాన్లో అందించే డేటా, వాయిస్‌కాల్స్‌, ఇతర సేవలు మాత్రం 30 రోజులకే పరిమితం. తరువాత చేసుకునే రీచార్జ్‌లపై డిస్కౌంట్‌ను అందిస్తుంది. ఉదాహరణకు ఎస్‌టీవీ రూ. 99 ప్రీపెయిడ్ ప్లాన్ స్టార్ సభ్యునికి రూ.76 కే అందుబాటులో ఉంటుంది. ఇదే మాదిరిగా వివిధ రీచార్జ్‌లపై స్టార్ మెంబర్లకు ప్రత్యేక డిస్కౌంట్లు లభిస్తాయి.

దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారుల సేవా కేంద్రాల్లో 6000 ఆధార్ నమోదు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు సంస్థ హైదరాబాద్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ డీఎస్ నరేంద్ర తెలిపారు. మంగళవారం సైఫాబాద్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ టెలిఫోన్ భవన్‌లో ఆధార్ నమోదు కేంద్రాన్ని బీఎస్ఎన్ఎల్ సెంట్రల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ జె. రవిచంద్రతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం నరేంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో 172 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. 

హైదరాబాద్ నగరంలో 57 కేంద్రాలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయని హైదరాబాద్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ డీఎస్ నరేంద్ర పేర్కొన్నారు. కొత్త ఆధార్ నమోదును ఉచితంగానే చేస్తామని, ఇతర మార్పులు, చేర్పులకైతే రూ.50 వరకు ఫీజు తీసుకుంటారని, కలర్ ప్రింట్ కోసం రూ.30 వసూలు చేస్తారని వివరించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు.

click me!