మరింత సురక్షితంగా ఏటీఎం లావాదేవీల నిర్వహణలో భాగంగా బ్యాంకులు చిప్ ఆధారిత డెబిట్, క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తెచ్చాయి.
న్యూఢిల్లీ: మరింత సురక్షితంగా ఏటీఎం లావాదేవీల నిర్వహణలో భాగంగా బ్యాంకులు చిప్ ఆధారిత డెబిట్, క్రెడిట్ కార్డులను అందుబాటులోకి తెచ్చాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఈ కార్డులే పనిచేస్తాయని అంతకుముందు చాలా రోజుల నుంచే ఖాతాదారులకు సూచించిన బ్యాంకులు.. పాత కార్డులను కొత్త కార్డులతో మార్చుకోవాలని కూడా స్పష్టం చేశాయి.
ఇప్పటికీ బ్యాంకుల నుంచి ఈ మేరకు మొబైల్ ఫోన్లకు సందేశాలు వస్తుండగా, మరిన్ని వివరాలకు సమీపంలోని తమ శాఖలను సంప్రదించాలనీ బ్యాంకర్లు కోరుతున్నారు. ఈ క్రమంలో అసలు కొత్త కార్డుల ప్రత్యేకత ఏమిటీ? వాటిని ఎలా వినియోగించుకోవాలో ఒక్కసారి తెలుసుకుందాం..
undefined
అమాయక కస్టమర్లు సైబర్ మోసాలకు బలై పోతున్న నేపథ్యంలో చిప్ ఆధారిత డెబిట్, క్రెడిట్ కార్డులను పరిచయం చేసిన బ్యాంకర్లు.. అవి పూర్తిస్థాయిలో ఈ ఏడాది ప్రారంభం నుంచి వాడకంలోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఏటీఎం మిషన్లను వేగంగా ఆధునీకరిస్తున్నారు. ఇప్పటికే చాలా ఏటీఎంలు మారిపోయాయి కూడా. కొత్త కార్డుల వినియోగంలో జాగ్రత్తలు పాటించకపోతే సదరు కార్డులే కోల్పోయే ప్రమాదం పొంచి ఉన్నది. అదెలాగంటే?..
ఏటీఎం మిషన్లలో కనిపించే కార్డు స్లాట్‌లో చిప్ ఆధారిత కార్డు పెట్టగానే అది లాకైపోతుంది. కార్డు మనకు కనిపిస్తున్నా అప్‌గ్రేడ్ మిషన్‌లో వచ్చిన ప్రత్యేక ఏర్పాట్లు కార్డును గట్టిగా పట్టి ఉంచుతాయి. కాబట్టి కంగారుపడి కార్డును వెనుకకు తీసుకునే ప్రయత్నం అస్సలు చేయకండి. ఇక స్క్రీన్‌పై కనిపించే సూచనలతో మీ లావాదేవీని పూర్తి చేయండి.
ఇంతకుముందులాగే కావాల్సిన సేవలను ఎంచుకని, సేవింగ్స్ ఖాతానా? కరెంట్ ఖాతానా? అన్న విషయం నమోదు చేసి క్యాష్ విత్ డ్రాయల్‌కైతే ఎంతకావాలో సదరు మొత్తాన్ని టైప్ చేయండి. వ్యక్తిగత పిన్ నంబర్‌ను అడిగినప్పుడు దాన్ని నమోదు చేయండి. అంతా అయిపోయాక కార్డును పట్టుకున్న అంతర్గత క్లిప్పులు వదులవుతాయి. అప్పుడు మన కార్డును మనం తీసేసుకోవచ్చు.
లావాదేవీ సమయంలో కార్డు స్లాట్‌లో ఎరుపు రంగు ఎల్‌ఈడీ లైట్ వెలుగుతూ కనిపిస్తుంది. పూర్తయ్యాక ఆ లైట్ ఆకుపచ్చ రంగులోకి మారుతుంది. అన్ని ఏటీఎంలలో ఈ రకమైన వసతి ఉంటుందో?.. లేదో?.. చెప్పలేం. కాబట్టి జాగ్రత్తగా స్క్రీన్‌పై ఉన్న సూచనలను తు.చ. తప్పకుండా పాటించండి. ఇక దుకాణాలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు తదితర చోట్ల డెబిట్, క్రెడిట్ కార్డులను ప్రస్తుత కొత్త రకం ఏటీఎంల తరహాలోనే వాడుతున్న సంగతి తెలిసిందే. ఆ కస్టమర్లకు తాజా మార్పు పెద్ద తేడాగా కనిపించకపోవచ్చు.
వివిధ ఏటీఎంలలో పాత కార్డులను మూడు రకాలుగా వినియోగించడం మనం చూశాం. మొదటిది ఏటీఎం మిషన్ కార్డు స్లాట్‌లో కార్డును పెట్టి, వెంటనే తీయడం. ఆ తర్వాత స్క్రీన్‌పై కనిపించే సూచనలతో వ్యక్తిగత పిన్ నంబర్‌ను వినియోగించి క్యాష్ విత్ డ్రాయల్స్, లేదా ఇతర సేవలను పొందడం జరిగింది.
రెండోది ఏటీఎం మిషన్‌లోని కార్డు స్లాట్‌లో కార్డును పెడితే, అది లోపలికి వెళ్లి కొద్ది సెకండ్ల తర్వాత బయటకు వచ్చేది. కార్డును తీసుకున్న తర్వాత స్క్రీన్‌పై కనిపించే సూచనలతో మన పిన్ నెంబర్ ఆధారంగా క్యాష్ విత్‌డ్రా, ఇతర సర్వీసులను అందుకున్నాం. మూడోది ఏటీఎం మిషన్‌లోగల కార్డు స్లాట్‌లో కార్డును పెట్టిన తర్వాత అది లోపలికి వెళ్లి.. మొత్తం మన లావాదేవీలు (నగదు ఉపసంహరణ లేదా ఇతరత్రా సేవలు) పూర్తయ్యాకగానీ వచ్చేదికాదు.
నిన్న, మొన్నటిదాకా కార్డు పెట్టి తీశాం.. కార్డు వెనుకకుపోయి తిరిగి వచ్చేది.. ఇప్పుడు రావట్లేదేంటి?.. అనుకొని కంగారుపడొద్దు. ఒకవేళ కొత్త విధానం గురించి తెలియకపోయినా ఏటీఎం గార్డులను వివరాలు అడుగండి. లేదంటే జాగ్రత్తగా స్క్రీన్‌పై ఉన్న సూచనలను పాటించండి. ఇంకా భయమేస్తే క్లియర్ లేదా క్యాన్సిల్ బటన్లను నొక్కండి. మీ కార్డు మీ చేతికి తిరిగి వస్తుంది.
కార్డును బలవంతంగా లాగే ప్రయత్నం చేస్తే కార్డు పాడైపోయే వీలున్నదని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా కార్డులోని చిప్ వద్ద విరిగిపోయే అవకాశం ఉన్నది. ఆ తర్వాత మరోసారి కార్డును వినియోగించలేని పరిస్థితి. అదనపు రుసుమును చెల్లించి బ్యాంకు నుంచి కొత్త కార్డును తీసుకోవాల్సిందే.