టెక్నాలజీ పరంగా ముందు పీఠిన నిలిచిన చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ‘హువావే’ తాజా 5జీ టెక్నాలజీపై దాదాపు పట్టు సాధించిందనే చెప్పాలి. ఆపిల్ కంటే ఎక్కువ పేటెంట్లను సొంతం చేసుకున్న హువావే వల్ల భద్రతా సమస్యలు తలెత్తుతాయని అమెరికా నిషేధించింది. కానీ అమెరికా సూచనలను తోసి రాజని బ్రిటన్, ఈయూ సభ్య దేశాలు హువావే సేవలను వినియోగించుకునేందుకు సిద్ధం కావడం గమనార్హం.
లండన్: అగ్రదేశం అమెరికాకు మిత్రపక్షం బ్రిటన్ అదిరిపోయే షాకిచ్చింది. తమ 5జీ నెట్‌వర్క్ నిర్మాణంలో చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ హువావే పాల్గొనేందుకు బ్రిటన్ లోని బోరిస్ జాన్సన్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ చైనా టెలికం దిగ్గజం హువావేపై అగ్రరాజ్యం అమెరికా నిషేధం విధించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో బ్రిటన్‌లోని బోరిస్ జాన్సన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నది. భద్రతాపరమైన ఆందోళనల పేరుతో హువావేని అమెరికా దూరం పెట్టింది. హువావేపై నిషేధాజ్ఞలు అమల్లో పెట్టాలని తమ మిత్ర దేశాలనూ కోరింది.
కానీ అందుకు భిన్నంగా తమ దేశంలో 5జీ నెట్ వర్క్ కార్యకలాపాలు నిర్వహించేందుకు హువావేకు మంగళవారం బ్రిటన్ పచ్చజెండా ఊపింది. అయితే కొన్ని ఆంక్షలను విధించడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 5జీ టెక్నాలజీ అమలుకు రంగం సిద్ధమవుతున్నది.
also read ఫెక్ యాప్ లను గుర్తించేందుకు పేటిఎం కొత్త ఫీచర్
డేటా ప్రాసెసింగ్‌లో వేగాన్ని, ఇంటర్నెట్ వినియోగంలో కస్టమర్లకు గొప్ప అనుభూతిని అందించడంలో 5జీ టెక్నాలజీ అత్యుత్తమం. భారత్‌లోనూ 5జీ సేవలు మొదలు కానుండగా, ట్రయల్ రన్‌లో పాల్గొనేందుకు గత నెల హువావేకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి విదితమే.
కాగా, తమ 5జీ నెట్‌వర్క్స్‌లో హువావే పరికరాలను వినియోగించుకోవడానికి బ్రిటన్ టెలికం ఆపరేటర్లకు ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. కానీ, భద్రతాపరంగా కీలకమైన రంగాలకు మాత్రం హువావే టెక్నాలజీ ప్రవేశానికి నో చెప్పింది. సున్నితమైన కీలక మౌలిక వసతుల రంగాలను మాత్రం హువావే వినియోగం నుంచి బ్రిటన్ తప్పించింది.
5జీ నెట్ వర్క్ సేవల్లో హువావే టెక్నాలజీని వినియోగించుకోవాలని యూరోపియన్ యూనియన్ (ఈయూ) అనుమతినిచ్చిన కొద్ది సేపటికే లండన్‌లో ప్రధాని బోరిస్ జాన్సన్ అధ్యక్షతన సమావేశమైన జాతీయ భద్రతా మండలి ఆమోద ముద్ర వేయడం గమనార్హం. ఈఈ, వొడాఫోన్ సంస్థలు మాత్రమే 5జీ సేవలందిస్తున్నాయొ. ఈ రెండు టెలికం ఆపరేటర్లు కేవలం లండన్, బర్మింగ్ హం నగరాలకు మాత్రమే పరిమితం అయ్యాయి.
బ్రిటన్ 5జీ నెట్ వర్క్ సేవల్లో తమ పరికరాలను వాడుకునేందుకు అనుమతించడాన్ని హువావే స్వాగతించింది. హైస్పీడ్ 5వ తరం నెట్ వర్క్ నిర్మాణంలో కీలకంగా వ్యవహరిస్తామని, తమ ఖాతాదారులతో కలిసి పని చేస్తామని హువావే ఉపాధ్యక్షుడు విక్టర్ జాంగ్ పేర్కొన్నారు.
also read వొడాఫోన్ ఐడియాకు గుడ్ బై - రిలయన్స్ జియోకు వెల్‌కం
భవిష్యత్‌లో ఎవిడెన్స్ బేస్డ్ నిర్ణయం మరింత అధునాతన సేవలను అందుకునేందుకు అవకాశం ఉంటుందని హువావే ఉపాధ్యక్షుడు విక్టర్ జాంగ్ అన్నారు. బ్రిటన్ 15 ఏళ్లుగా హువావే సేవలను ఉపయోగించుకుంటున్నది. అమెరికా హెచ్చరికలు తోసి రాజని మంగళవారం బ్రస్సెల్స్‌లో టాప్ యూరోపియన్ యూనియన్ అధికారి మాట్లాడుతూ తమ బ్లాక్ హువావే సేవలను నిషేధించబోదని, కాకుంటే కఠిన నిబంధనలు అమలులోకి తెస్తామని తెలిపారు.
మరోవైపు 5జీ నెట్ వర్క్ విస్తరణ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు హువావేకు అనుమతినిస్తూ బ్రిటన్ తీసుకున్న నిర్ణయంపై అమెరికా అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘5జీ సెల్యులార్ నెట్‌వర్క్ కోసం హువావే టెక్నాలజీ వినియోగానికి బ్రిటన్ అంగీకరించడం సంతృప్తికరంగా లేదు’ అని ఓ ప్రకటనలో అమెరికా అధికార వర్గాలు పేర్కొన్నాయి.
హువావే రాక బ్రిటన్‌కు క్షేమదాయకం కాదని అమెరికా ప్రభుత్వ వర్గాలు హెచ్చరించాయి. చైనాలోని జీ జిన్ పింగ్ సర్కార్ కనుసన్నల్లో పనిచేసే హువావేతో తమకు ముప్పు ఉంటుందనే దానిపై మేము నిషేధం విధించామని, ఏ దేశానికైనా ఇదే తరహా ఇబ్బందే ఉండొచ్చని అమెరికా ఒకింత ఆందోళన వ్యక్తం చేసింది.