జూమ్​, గూగుల్ యాప్స్ పోటీగా రిలయన్స్ జియో కొత్త యాప్..

By Sandra Ashok KumarFirst Published Jul 4, 2020, 11:05 AM IST
Highlights

దేశీయ వ్యాపార దిగ్గజం రిలయన్స్ 'జియో మీట్​' యాప్​ను విపణిలో ప్రవేశపెట్టింది. ఈ యాప్​ ద్వారా 100 మంది ఒకేసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యేందుకు వీలు కలుగుతుందని ప్రకటించింది. 
 

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ దేశీయ టెలికం సంచలనం రిలయన్స్ జియో విపణిలోకి వీడియో కాన్ఫరెన్సింగ్​ యాప్​ను   ప్రవేశపెట్టింది. జియో మీట్ పేరుతో ఒకేసారి 100 మంది సమావేశం అయ్యేందుకు వీలయ్యే యాప్​ను అందుబాటులోకి తెచ్చింది.

కరోనా విజృంభణ వేళ.. జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, సిస్కో వెబెక్స్, గూగుల్ మీట్ సహా ఇతర సంస్థల వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్​ల వినియోగం పెరిగిన నేపథ్యంలో జియో మీట్​ను రిలయన్స్ అందుబాటులోకి తీసుకు వచ్చింది.

వెబ్ కాన్ఫరెన్సింగ్ యాప్​లు ఇప్పటివరకు ఈ సదుపాయానికి కొంత సొమ్ము వసూలు చేస్తుండగా, జియో మాత్రం ఎలాంటి రుసుములు ఛార్జి చేయట్లేదని వెల్లడించింది. కాన్ఫరెన్స్ సమయానికి ఎలాంటి గడువు లేదని స్పష్టం చేసింది. 24 గంటల పాటు నిరంతరాయంగా వీడియోలో మాట్లాడుకునే వెసులుబాటు కల్పిస్తోంది జియో.

also read 

ఈ వీడియో కాన్పరెన్స్ యాప్‌ను గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్‌బాక్స్ నుంచి పొందవచ్చు. మిగతా సంస్థలు యాప్‌ల కోసం కోడ్ ఏర్పాటు చేశాయి. జియో అందుకు భిన్నంగా నేరుగా వీడియో యాప్ తెరుచుకోవడనికి వీలు కల్పిస్తున్నది. వినియోగదారులు బ్రౌజర్ ద్వారా క్లిక్ చేస్తే వీడియో కాన్ఫరెన్స్ లోకి వెళ్లవచ్చు.

వీడియో యాప్ ‘జియో మీట్’ విడుదల చేసే నాటికి రిలయన్స్ జియో సంస్థలో 11 సంస్థలు గత 11 వారాల్లో రూ.1,17,588 కోట్ల మేరకు పెట్టుబడులను ఆకర్షించింది. కరోనా మహమ్మారి ప్రభావం నుంచి భారతదేశ ఆర్థిక వ్యవస్థను కోలుకోవడానికి ప్రధాని నరేంద్రమోదీ ఆత్మ నిర్బర్ భారత్ పథకం ప్రకటించిన వేళ.. 59 చైనా యాప్స్‌ను నిషేధించిన సమయంలో రిలయన్స్ జియో.. ఈ వీడియో యాప్ ఆవిష్కరించడం గమనార్హం. 

ప్రస్తుతం జియో మీట్ యాప్‌కు ‘యాప్ స్టోర్ 4.8 హై’, గూగుల్ ప్లే స్టోర్ 4.6 రేటింగ్ ఇచ్చాయి. ఇప్పటికే జియో మీట్ యాప్‌ను 100 వేల మంది ఆండ్రాయిడ్ యూజర్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. 

ఇదిలా ఉంటే చైనా యాప్ ‘జూమ్’ వాడవద్దంటూ గత ఏప్రిల్ నెలలో కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది. జూమ్ యాప్‌కు ప్రత్యామ్నాయ యాప్ రూపొందించిన వారికి రూ. కోటి బహుమతి అందజేస్తామని హోంశాఖ ప్రకటించింది.  

click me!