టెలికం పరిశ్రమ బతికి బట్ట కట్టాలంటే మొబైల్స్‌లో ఒక్క జీబీ డేటా రూ.35కు పెంచాలని వొడాఫోన్ ఐడియా సూచించింది. అలాగే నెలసరి కనీస కనెక్షన్ చార్జీ రూ.50గా నిర్ణయించాలని భారతీయ టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్), టెలికం శాఖ (డాట్)లను కోరింది. ఈ ప్రతిపాదనలను ఏప్రిల్ కటో తేదీ నుంచి అమలు చేయాలని అభ్యర్థించింది.
ఏజీఆర్ బకాయిల చెల్లింపుల అంశం ప్రైవేట్ టెలికం ప్రొవైడర్ వొడాఫోన్ ఐడియాపై బాగానే పడినట్లుంది. అందుకే టెలికం రంగ పరిశ్రమ బతికి బట్ట కట్టాలన్నా.. తాము ఏజీఆర్ బకాయిలు చెల్లించాలన్న మొబైల్ డేటా కనీస చార్జీ పెంచేయాలని ప్రతిపాదించింది.
ఒక్క జీబీ (గిగాబైట్) మొబైల్ డేటా కనీసధరను రూ.35గా నిర్ణయించాలని వొడాఫోన్ ఐడియా డిమాండ్ చేసింది. ప్రస్తుత ధరలతో పోల్చితే ఇది దాదాపు 7-8 రెట్లు అధికం కావడం గమనార్హం. ఇప్పుడు ఒక జీబీ డేటా రూ.4-5కే లభిస్తున్నది. అలాగే నెలసరి కనీస కనెక్షన్ చార్జీని రూ.50, ఔట్ గోయింగ్ కాల్స్‌పై నిమిషానికి ఆరు పైసలు వసూలు చేయాలన్నది.
undefined
టెలికం శాఖ (డీవోటీ), టెలికం రెగ్యులేటర్ ట్రాయ్‌కు రాసిన ఓ లేఖలో ఈ మేరకు వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ ప్రతిపాదించింది. నిజానికి కాల్స్, ఇంటర్నెట్ ధరలు 50 శాతం వరకు పెరిగి మూడు నెలలైనా కాలేదు. కాగా, మొబైల్ డేటా, కాల్స్ ధరలు పెరిగితేనే టెలికం పరిశ్రమ బాగుంటుందన్న వొడాఫోన్ ఐడియా.. అప్పుడే తాము ఏజీఆర్ బకాయిలనూ చెల్లించగలుగుతామని స్పష్టం చేసింది.
వచ్చే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ధరలను పెంచాలని వొడాఫోన్ ఐడియా సూచించింది. పీకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియా.. సుప్రీం కోర్టు ఆదేశంతో టెలికం శాఖకు రూ.53,038 కోట్ల ఏజీఆర్ బకాయిలను చెల్లించాల్సి ఉన్న సంగతి తెలిసిందే.
ఇప్పటిదాకా వొడాఫోన్ ఐడియా కేవలం రూ.3,500 కోట్లే చెల్లించింది. మిగతా నిధుల కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వ సాయం లేకపోతే బాకీలను కట్టలేమన్న సంకేతాలను ఇస్తున్నది.
ఏజీఆర్ బకాయిలను ఇప్పట్లో తీర్చలేమని, బాకీలు చెల్లించడానికి 18 ఏళ్ల సమయం కావాలని వొడాఫోన్ ఐడియా కోరింది. వడ్డీ, జరిమానాలపై మూడేళ్ల మారటోరియం విధించాలని డిమాండ్ చేసినట్లు పీటీఐకి సంబంధిత అధికారి ఒకరు తెలిపారు.
రూ.8 వేల కోట్ల జీఎస్టీ బకాయిలు ఇవ్వాలని కేంద్రాన్ని వొడాఫోన్ ఐడియా కోరిందని, వడ్డీరేటును 6 శాతంగానే నిర్ణయించాలని డిమాండ్ చేసిందని ఆ అధికారి చెప్పారు. లైసెన్స్ ఫీజును భారీగా తగ్గించాలనీ, కాల్స్, డేటా కనీస ధరలను పెంచాలన్నట్లు వివరించారు.
తమకు 30 కోట్ల కస్టమర్లు ఉన్నారని, సంస్థ లో 10 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, సంస్థను బతికించే నిర్ణయాన్ని తీసుకోవాలని వొడాఫోన్ ఐడియా విన్నవించినట్లు సదరు అధికారి వెల్లడించారు. మరోవైపు దీనిపై స్పందించేందుకు వొడాఫోన్ ఐడియా అధికార ప్రతినిధి నిరాకరించారు.
ఇదిలావుంటే వొడాఫోన్ ఐడియా ప్రతిపాదనలకు భారతీయ సెల్యులార్ ఆపరేటర్ల సంఘం మద్దతు తెలిపింది. టెలికం పరిశ్రమను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై శుక్రవారం డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ సమావేశం అవుతున్నట్లు సమాచారం.
దేశీయంగా 2019లో దేశీయంగా ఒక్కో మొబైల్ వినియోగదారుడి సగటు డేటా వాడకం నెలకు 47 శాతం పెరిగి 11 జీబీకిపైగా నమోదైంది. దేశ వ్యాప్తంగా డేటా వినియోగంలో 96 శాతం 4జీ డేటానే కావడం గమనార్హం. గతంలో ఎన్నడూ లేనివిధంగా 3జీ డేటా 30 శాతానికి పరిమితం అయ్యింది. బ్రాడ్‌బాండ్ డేటా సేవల వినియోగం 47 శాతం వ్యాప్తి చెందింది.
ప్రపంచంలోకెల్లా అతి తక్కువగా భారతదేశంలో మొబైల్ ఫోన్ల వినియోగంపై ఒక్క జీబీకి దాదాపు రూ.7 వసూలవుతోంది. దేశంలో 4జీ డేటా వినియోగదారులు 59.8 కోట్లు ఉంటుందని అంచనా. గతేడాది వరకు 50.1 స్మార్ట్ ఫోన్లు వినియోగంలో ఉన్నాయని తెలుస్తోంది. అంతకుముందేడాది
2018లో 33 కోట్ల ఫోన్లు ఉన్నాయి. వీవోఎల్‌టీఈ ఆధారిత స్మార్ట్‌ఫోన్లు 43.2 కోట్లుగా ఉన్నాయి.
సవరించిన స్థూల ఆదాయానికి (ఏజీఆర్) సంబంధించిన బకాయిలను పూర్తిగా చెల్లించే స్థితిలో తాము లేమని టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా పేర్కొంది. చెల్లింపులు, సుంకాలు, ఫ్లోర్ ప్రైస్ విషయంలో ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుంటేనే చెల్లింపు సాధ్యమవుతుందని తెలిపింది. ఈ మేరకు టెలికాం విభాగానికి ఆ కంపెనీ లేఖ రాసింది.
ఏజీఆర్ బకాయిల్లో కేవలం 7 శాతం మాత్రమే ఇప్పటి వరకు చెల్లించామని లేఖలో వొడాఫోన్ ఐడియా పేర్కొంది. ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.8వేల కోట్ల జీఎస్టీ క్రెడిట్ చెల్లిస్తే ఏజీఆర్ బకాయిలు చెల్లింపునకు తోడ్పడుతుందని తెలిపింది.
లైసెన్స్ ఫీజును ప్రస్తుతం ఉన్న 8 శాతం నుంచి మూడు శాతానికి తగ్గించాలని, స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీలు (ఎస్‌యూసీ)ను సున్నా చేయాలి లేదా అన్ని సెక్ట్రంల్లో ఒకే విధానం పాటించాలని లేఖలో పేర్కొంది. ఏజీఆర్ బకాయిల కింద రూ.1.47 లక్షల కోట్లు చెల్లించాలని టెలికాం కంపెనీలకు సుప్రీం కోర్టు గతేడాది అక్టోబర్‌లో ఆదేశించిన సంగతి తెలిసిందే.
టెలికం సంస్థలకు జనవరి 23 వరకు సుప్రీంకోర్టు గడువు ఇచ్చింది. టెలికం కంపెనీలు ఆ గడువులోగా బకాయిలు చెల్లించకపోవడం పట్ల కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. గడువును పొడిగించాలంటూ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా దాఖలు చేసిన పిటిషన్‌ను సైతం తోసిపుచ్చింది.