
చెన్నై: తమిళనాడులో సినిమా నటులన్నా, రాజకీయ నేతలన్న ప్రజలు వల్లమాలిన అభిమానం చూపిస్తారు. అవసరమైతే తమ ప్రాణాలను కూడ ఫణంగా పెట్టేందుకు వెనుకాడరు. రాష్ట్రంలో డీఎంకె అధికారంలోకి వచ్చి స్టాలిన్ సీఎం కావాలంటూ ఆ పార్టీ కార్యకర్త చేతివేళ్లను నరుకొన్నాడు.
ఈ నెల 6వ తేదీన తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.ఈ తరుణంలో ఈ ఘటన చోటు చేసుకొంది. విరుధ్‌నగర్ కు చెందిన డీఎంకె కార్యకర్త గురవయ్య స్టాలిన్ సీఎం కావాలని కోరుకొంటూ మరియమ్మన్ ఆలయానికి వెళ్లి తన ఎడమ చేయి వేలును కోసుకొన్నాడు. అతని వయస్సు 66 ఏళ్లు.
ఏ ఎన్నికలు వచ్చినా డీఎంకె జెండా పట్టుకొని పార్టీ కోసం ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తాడు. 10 ఏళ్లుగా పార్టీ అధికారానికి దూరంగా ఉండడంతో ఈ దఫా ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకోవాలని డీఎంకె నేతలు కూడ పట్టుదలతో పనిచేస్తున్నారు. అయితే తమ పార్టీ అధికారంలోకి రావాలని గురవయ్య మొక్కు చెల్లించుకొన్నాడు.
ఈ ఆలయానికి ఆయన తరచూ వస్తుంటాడు. ఇవాళ కూడ అలానే ఆలయానికి వచ్చాడు. ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత తన చేతి వేళ్లు నరికి అమ్మవారికి కానుకగా ఇచ్చారు. ఆలయంలో చేతి వేళ్లు నరుకొన్న గురువయ్యను గుర్తించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించారు.
గతంలో జయలలిత కోసం ఓ అభిమాని నాలుక కోసుకొన్నాడు. తమిళనాడు రాష్ట్రంలో ఈ తరహా ఘటనలు అనేకం చోటు చేసుకొన్నాయి. తమిళనాడు రాష్ట్రంలో అన్నాడిఎంకె, బీజేపీ ఒక కూటమిగా పోటీ చేస్తున్నాయి. డీఎంకె , కాంగ్రెస్ మరో కూటమిగా పోటీ చేస్తున్నాయి. కమల్ హాసన్ తన పార్టీ అభ్యర్ధుల తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.